ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన రైతు
మనతెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని, పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని అనాజిపురం గ్రామానికి చెందిన రైతు కుమ్మరికుంట్ల శేఖర్‌రెడ్డి 30 ఏళ్ల క్రితం తన బావి దగ్గర బోరు వేసుకున్నాడని, ఆ నీటితోనే తన పొలాన్ని సాగుచేసుకుంటున్నాని తెలిపాడు. కాగా అతని పక్కనే ఉన్న రైతు బండ మల్లయ్య ఏప్రిల్ 21న బోరు వేశాడని, దీంతో ఒక్కసారిగా తన బోరు నీరు పోయడం ఆగిపోయిందని విలపించాడు.
మల్లయ్య వాల్టా చట్టానికి విరుద్ధంగా తన బోరు సమీపంలోనే బోరు వేయడంతో తన బోరు ఎండిపోయిందని, ఆ బోరును వెంటనే సీజ్ చేసి తనకు న్యాయం చేయాలని కోరాడు. శేఖర్‌రెడ్డి ఏప్రిల్ 22న తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశాడని, మే 22న మల్లయ్యకు నోటీసులు ఇచ్చినా నేటికీ చర్యలు తీసుకోలేదని, దీంతో భూమి సాగు చేసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు చావే శరణ్యమని, అధికారులు మామూళ్లు తీసుకొని చర్యలు తీసుకోకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని అన్నాడు.
తనకు న్యాయం చేయకుంటే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ పోసుకొని పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా కార్యాలయం దగ్గర ఉన్న పలువురు అడ్డుకొని వారించారు. ఈ విషయమై తహశీల్దార్ జ్యోతిని వివరణ కోరగా శుక్రవారం మల్లయ్య బోరును సీజ్ చేస్తామని తెలిపారు. దీంతో రైతు శేఖర్‌రెడ్డి ఆందోళన విరమించాడు.