బెంగళూరు: 1996 కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో దాదాపు మూడు దశాబ్దాలుగా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుడు, సీరియల్ కిల్లర్ సాదిక్ రాజా అలియాస్ టైలర్ రాజాను ఎట్టకేలకు అరెస్టు చేశారు. కర్ణాటకలోని విజయపురలో తప్పుడు గుర్తింపుతో నివసిస్తున్న అతన్ని కోయంబత్తూరు పోలీసులు పట్టుకున్నారు. చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటకు చెందిన సాదిక్ రాజా 1996 పేలుడు తర్వాత పరారీలో ఉన్నాడు. పోలీసు వర్గాల ప్రకారం.. నిందితుడు ఒకే చోట ఉండకుండా పలు రాష్ట్రాలకు మారుతూ తప్పించుకు తిరిగాడు. మొదట తమిళనాడు నుండి బెంగళూరుకు, తరువాత హుబ్బళ్లికి, చివరికి విజయపురలో స్థిరపడ్డాడు. గత 12 సంవత్సరాలుగా, అతను కూరగాయల వ్యాపారిగా పనిచేస్తూ, మారు పేరుతో నివసిస్తూ, తక్కువ ప్రొఫైల్ జీవితాన్ని గడిపాడు. అతను హుబ్బళ్లిలో ఒక స్థానిక మహిళను కూడా వివాహం చేసుకున్నాడు. ఇది అతను సమాజంలో కలిసిపోవడానికి మరింత సహాయపడింది.
సాదిక్ రాజా 1996 కోయంబత్తూరు పేలుడులో పాల్గొనడమే కాకుండా.. మధురై, నాగూర్ పేలుళ్లతో సహా ఇతర ప్రధాన సంఘటనలలో కూడా పాత్ర పోషించాడని దర్యాప్తులో వెల్లడైంది. అతనిని గుర్తించకుండా ఉండటానికి.. తన పేరు, గెటప్, నివాసాన్ని మారుస్తూ తిరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. చివరికి.. కోయంబత్తూరు పోలీసులు పక్కా విశ్వసనీయ నిఘా సమాచారం ఆధారంగా రంగంలోకి దిగి అరెస్టు చేశారు. చివరి దశ వరకు విజయపురలోని స్థానిక పోలీసులకు కూడా వివరాలను దాచిపెట్టి, ఈ ఆపరేషన్ అత్యంత రహస్యంగా నిర్వహించారు. తమిళనాడు ఉగ్రవాద నిరోధక దళం, కోయంబత్తూరు నగర పోలీసుల సంయుక్త బృందం ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది.
ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. “అరెస్టు నుంచి తప్పించుకునేందుకు సాదిక్ తన పేరు, నివాసాన్ని మార్చుకుంటూనే ఉన్నాడు. సంవత్సరాల తరబడి ట్రాక్ చేసిన తర్వాత, మేము చివరికి అతను ఉండే ప్రాంతాన్ని గుర్తించాం. విచారణ, ఇతర నిందితుల నుండి వచ్చిన ఇన్పుట్ల ద్వారా అతన్ని పట్టుకున్నాం” అని చెప్పారు. సాదిక్ రాజాను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం తమిళనాడుకు తరలించారు. 29 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన 2023లో స్థాపించబడిన ఉగ్రవాద నిరోధక దళాన్ని ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ అభినందించారు.