చెన్నై: డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ (Actor Sriram) గత నెల 23వ తేదీన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు శ్రీరామ్‌ను అరెస్ట్ చేసిన అధికారులు పుళల్ జైలుకు తరలించారు. శ్రీరామ్‌తో పాటు మరో హీరో కృష్ణను కూడా డ్రగ్స్ కేసులో గత నెల 26న అరెస్ట్ చేశారు. వీరిద్దరు విచారణలో తమ తప్పును అంగీకరించారు. ఆ తర్వాత చెన్నై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే వీరి బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో హీరోల తరఫు న్యాయవాదులు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం రెండు రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అనంతరం బెయిల్ ప్రతులను న్యాయవాదులు జైలు అధికారులకు పంపించగా.. ప్రొసిజర్స్ పూర్తి చేసి శ్రీరామ్ (Actor Sriram), కృష్ణలను విడుదల చేశారు. అయితే అన్నాడిఎంకె మాజీ నేత ప్రసాద్ తనకు డ్రగ్స్ అలవాటు చేశాడని.. డ్రగ్స్ వినియోగించి తప్పు చేసినట్లు శ్రీరామ్ విచారణలో అంగీకరించారు.
సదరు నేత నిర్మించిన ‘తీంగిరై’ అనే సినిమాలో నటిస్తే.. ఆ ప్రాజెక్టుకు సంబంధించి రూ.10 లక్షలు ఇవ్వాలని తెలిపారు. అయితే డబ్బులు అడిగినప్పుడల్లా.. తనకు కొకైన్ ఇచ్చేవాడని అన్నారు. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి తానే అడిగే పరిస్థితి వచ్చిందని పోలీసులకు తెలిపారు. తాను తప్పు చేసినట్లు అంగీకరించిన శ్రీరామ్ తన కుమారుడిని చూసుకోవాలని దయచేసి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది.