హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బడిబాట కార్యక్రమం సత్ఫలితాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. వివిధ తరగతుల్లో మొత్తం 3.68 లక్షల మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారు. ఈ విషయంపై సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ‘మన తెలంగాణ’తో పాటు వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను జత చేసి ఆయన ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు.
‘‘పదేళ్ల చీకట్లను పారదోలి… ప్రభుత్వ పాఠశాలల్లో అక్షర జ్యోతులు వెలుగుతున్నాయి. పేద బిడ్డల చదువుల గుడులు అక్షర మంత్రోశ్ఛారణలతో పవిత్రతను సంతరించుకున్నాయి. సర్కారు బడికి గత పాలకులు వేసిన తాళాలు బద్ధలవుతున్నాయ.
పాఠశాలల్లో కనిపిస్తోన్న ఈ గుణాత్మక మార్పు తెలంగాణ భవిష్యత్ గమనానికి సంకేతం. ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనం. ఈ అక్షర యజ్ఞంలో చేతులు కలిపిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు’’ అంటూ సిఎం రేవంత్ (Revanth Reddy) ఎక్స్‌లో పోస్ట్ చేశారు.