నేడు అనిసిమోవాతో తుది పోరు
లండన్: ప్రపంచ మహిళా టెన్నిస్‌పై తనదైన ముద్ర వేసిన పోలండ్ యువ సంచలనం ఇగా స్వియాటెక్ తన కెరీర్‌లో తొలి వింబుల్డన్ టైటిల్‌ను (Wimbledon title) సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. శనివారం జరిగే ఫైనల్లో 8వ సీడ్ ఇగా స్వియాటెక్ అమెరికాకు చెందిన 13వ సీడ్ అమందా అనిసిమోవాతో తలపడనుంది. స్వియాటెక్ ఇప్పటికే ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను (Wimbledon title) సొంతం చేసుకుంది. నాలుగు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన ఇగా ఓసారి యూఎస్ ఓపెన్‌ను దక్కించుకుంది. తొలిసారి వింబుల్డన్ ఓపెన్ ఫైనల్లో ప్రవేశించింది.
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన కెరీర్‌లో తొలి వింబుల్డన్ ట్రోఫీని జత చేసుకోవాలని తహతహలాడుతోంది. ఫైనల్లో ఇగాఫేవరెట్‌గా కనిపిస్తోంది. మహిళల టెన్నిస్‌లోని అగ్రశ్రేణి క్రీడాకారిణిల్లో ఒకరిగా ఇగా పేరు తెచ్చుకుంది. నిలకడైన ఆటతో విమెన్స్ టెన్నిస్‌పై తనదైన ముద్ర వేసింది. ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ టైటిల్‌తో పూర్వవైభవం సంతరించుకోవాలని భావిస్తోంది. మరోవైపు అమందా కెరీర్‌లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అమందా అసాధారణ ఆటతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన సెమీ ఫైనల్లో టాప్ సీడ్ అరినా సబలెంకను మట్టికరిపించింది. సబలెంకను ఓడించిన అమందా ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తోంది.
ఈ టోర్నీలో అమందా అత్యంత నిలకడైన ఆటతో అలరిస్తోంది. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగింది. ఇక కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు ఓ విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగే ఫైనల్లో గెలిచి చరిత్ర సృష్టించాలని అమందా తహతహలాడుతోంది. ఇగా కూడా ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసింది. ఇద్దరు కూడా జోరుమీదుండడంతో తుది పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
టైటిల్ పోరుకు అల్కరాజ్
వింబుల్డన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్) ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి సెమీఫైనల్లో రెండో సీడ్ అల్కరాజ్ 64, 57, 63, 76(8/6) తేడాతో అమెరికాకు చెందిన ఐదో సీడ్ టి.ఫ్రిట్జ్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు అల్కరాజ్ అటు ఫ్రిట్జ్ సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా తయారైంది. తొలి సెట్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. కానీ కీలక సమయంలో ఫ్రిట్జ్ ఒత్తడికి గురై వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన అల్కరాజ్ సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నటే కొనసాగింది.
ఈసారి కూడా ఇద్దరు సర్వం ఒడ్డారు. ఫ్రిట్జ్ అసాధారణ ఆటతో అల్కరాజ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో టైబ్రేకర్‌లో సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్‌లో మళ్లీ అల్కరాజ్ పుంజుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడైన ఆటతో ఫ్రిట్జ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. తన మార్క్ షాట్లతో విరుచుకు పడిన అల్కరాజ్ పెద్దగా ప్రతిఘటన లేకుండానే సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ నాలుగో సెట్‌లో మళ్లీ హోరాహోరీ తప్పలేదు. ఈసారి ఫ్రిట్జ్ కూడా అద్భుత పోరాట పటిమను కనబరిచాడు.
తన మార్క్ షాట్లతో అల్కరాజ్‌ను హడలెత్తించాడు. ఇద్దరు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో సెట్ టైబ్రేకర్ (Wimbledon title) వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో కూడా ఉత్కంఠ తప్పలేదు. కానీ ఆఖరు వరకు ఆధిక్యాన్ని నిలటెట్టుకోవడంలో సఫలమైన అల్కరాజ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్‌కు చేరుకున్నాడు. అల్కరాజ్ వింబుల్డన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. 2023, 2024లలో అల్కరాజ్ వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచాడు. తాజాగా మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.