Saturday, July 12, 2025

చైనాపై ఆధారపడటమేనా?

- Advertisement -
- Advertisement -

కీలకమైన ఖనిజాల సరఫరా గొలుసులో చైనా ప్రపంచం మొత్తంమీద ఆధిపత్యం వహిస్తోందన్న సంగతి అందరికీ తెలిసిందే. అరుదైన ఖనిజాలనుంచి 78 శాతం కేథోడ్లను, 85 శాతం ఏనోడ్లను, 70 శాతం బ్యాటరీ సెల్స్‌ను, 95 శాతం పెర్మనెంట్ మాగ్నెట్లను చైనా తయారు చేస్తోంది. చైనాలో 60 శాతం అరుదైన ఖనిజాలు ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన భూఅయస్కాంత తయారీకి సంబంధించిన సాంకేతికతపై ప్రాపర్టీ హక్కులను చైనా తన సంరక్షణలో ఉంచుకుంది. అరుదైన ఖనిజాల ప్రాముఖ్యతను ఏనాడో చైనా గుర్తించింది. 1990 ప్రారంభంలో అమెరికా తన కీలకమైన ఖనిజాలను ప్రాసెస్ చేయడంపై దృష్టి పెట్టకుండా చైనాకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇదే చైనాకు ఖనిజాలపై గుత్తాధిపత్యం సాధించడానికి అవకాశం కల్పించింది.

ప్రాసెసింగ్ విషయానికి వస్తే ప్రపంచం మొత్తం మీద నికెల్‌లో 35 శాతం చైనా ప్రాసెస్ చేస్తోంది. 50 నుంచి 70 శాతం లిథియమ్, కోబాల్ట్, 90 శాతం అరుదైన ఖనిజాలను ప్రాసెస్ (Process rare minerals) చేస్తోంది. గెలీయమ్, జెర్మేనియమ్ తదితర అరుదైన ఖనిజాల ఎగుమతులు, సరఫరాలపై చైనా గత ఏడాది కాలంగా ఆంక్షలు విధిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆంక్షలను చైనా ఇటీవల మరింత కఠినతరం చేసింది. ఆధునిక యుగ పరిశ్రమలకు ఎంతో అవసరమైన ఈ అరుదైన ఖనిజాల తవ్వకం, శుద్ధి చేయడంపై చైనా తన గుత్తాధిపత్యాన్ని భౌగోళిక, రాజకీయ బేరసారాల పాచికగా ఉపయోగిస్తోంది. అమెరికా తన ప్రధాన శత్రువే అయినప్పటికీ, ఈ ఖనిజ మూలకాల ఎగుమతి, సరఫరాను మరింత కట్టుదిట్టం చేయడంతో భారత్‌తోపాటు మిగతా దేశాలు అనుకోని కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది.

చైనా తన సరఫరాను ఆయుధీకరణగా మారుస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనాను ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అపురూప ఖనిజాల తవ్వకం, ప్రాసెస్ వంటి విధానాలను ప్రోత్సహించే విషయంలో ఎదురవుతున్న సవాళ్లకు భారత్ తనకు తానే చాలా ఆలస్యంగా మేల్కొంది. కానీ ఇది అంత సులువైన విషయం కాదు. ఈ విషయంలో పురోగతి చాలా మందగమనంలా సాగుతోంది. అందువల్ల మిగతా దేశాల మాదిరిగానే భారత్ కూడా సమీప కాలంలో చైనాపైనే ఆధారపడక తప్పదు. అరుదైన భూ మూలకాలు అంటే వాటి లభ్యత బట్టి కాదు. వాటిని వెలికితీసి ఉపయోగానికి అనువుగా శుద్ధి చేయడమే క్లిష్టతరమైన ప్రక్రియ. ఇది ఎంతో వ్యయంతో కూడుకున్నదే కాక, అత్యధిక కాలుష్యానికి దారితీసే ప్రక్రియ.

క్లీన్ ఎనర్జీ, ఎలెక్ట్రానిక్స్, డిఫెన్స్, ట్రాన్స్‌పోర్టేషన్, టెలికమ్యూనికేషన్స్, ఎరువులు, ఫార్మాక్యూటికల్స్, విద్యుత్ వాహనాలకు, కీలకమైన ముడి వనరులుగా వీటి ప్రాధాన్యం పెరుగుతోంది. మిలిటరీ సామగ్రి, ఆయుధాల్లోనూ కొన్ని అరుదైన ఖనిజాల అవసరం ఉంటోంది. వీటన్నిటికన్నా మరో కారణం ఏమంటే అమెరికాను వాటినుంచి దూరం చేయాలని చైనా అనుకుంటోంది. భారత్ విషయానికి వస్తే విద్యుత్ వాహనాలను, ఎలక్ట్రానిక్స్‌ను భారీ స్థాయిలో తయారు చేయాలనే అత్యంత ప్రతిష్ఠాత్మక విధానానికి అరుదైన భూ అయస్కాంతాలు ఎంతోఅవసరం. టారిఫ్‌లను అత్యధికంగా విధించడం కన్నా చైనా నుంచి ఈ అరుదైన ఖనిజ మూలకాలు సరఫరా అయ్యేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇటీవల తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

చైనా నుంచి ఈ ఖనిజ మూలకాల సరఫరా కొనసాగేలా వాణిజ్యపరంగా, దౌత్యపరంగా ప్రయత్నాలు చేస్తామని సూచించినప్పటికీ చైనాతో ప్రత్యక్షంగా చర్చలు సాగించడానికి భారత్ దూరం గా ఉంటోంది. ఈ విషయంలో చైనా గుత్తాధిపత్యాన్ని ఛేదించడానికి, అరుదైన ఖనిజ మూలకాల ఉత్పత్తిలో ప్రపంచ మార్కెట్‌లో చైనా భాగస్వామ్యం క్షీణించేలా చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ వచ్చే దశాబ్దంలో ఈ ప్రభావం అంతగా ఉండదని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనావేస్తోంది. అంటే దీని అర్థం పొరుగు విరోధి దేశమైన చైనా దయాదాక్షిణ్యాలపై భారత్ కొంతకాలం ఆధారపడక తప్పదని చెప్పవచ్చు. దీన్ని సవాలుగా తీసుకొని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ కీలకమైన ఖనిజ మూలకాల తవ్వకాలను విస్తరింప చేసింది. భారత్ 30 ఖనిజాలను ఎంతో కీలకమైనవిగా గుర్తించింది.

అమెరికా 50 ఖనిజాలు, జపాన్ 31 ఖనిజాలు, బ్రిటన్ 18 ఖనిజాలను కీలకమైనవిగా గుర్తించాయి. 2023లో కీలకమైన ఖనిజ వేలాన్ని భారత్ ప్రారంభించింది. 20 బ్లాక్‌ల్లో ఈ వేలం నిర్వహించింది. జమ్మూకశ్మీర్ రియాసి జిల్లాలో 5.9 మిలియన్ టన్నుల లిథియమ్ నిల్వలను కనుక్కొని ఆ నిల్వలను వేలం వేసింది. మరో 500 బ్లాక్‌ల ఖనిజాలను వేలం వేయాలన్న లక్షం పెట్టుకున్నారు. ఈ మైనింగ్ బ్లాక్‌ల వేలం గత మార్చిలో ఐదోసారి పిలిచినా పరిమిత భౌగోళిక డేటా, నిలకడలేని పాలనా విధానాల వల్ల ఎవరూ అంతగా ఆసక్తి చూపించడం లేదు. సెమీకండక్టర్ల ఉత్పత్తిలో ప్రపంచస్థాయి దేశంగా స్థానం పొందాలని భారత్ ఆకాంక్షిస్తోంది.

ఈ మేరకు గత ఏడాది అమెరికాతో వాణిజ్యపరమైన చర్చల్లో కీలకమైన ఖనిజాల విషయంలో ఒప్పందం కుదిరింది. ఖనిజాలను వెలికితీయడం, వేరుచేయడం, ప్రాసెస్ చేయడం, దానికి సంబంధించిన సాంకేతికత పంచుకోవడం, తదితర అంశాలు ఈ ఒప్పందంలో చోటుచేసుకున్నాయి. అరుదైన ఖనిజాల తవ్వకంలో భారత్ స్వయం సామర్థం సాధిస్తుందా లేక చైనా పైనే ఆధారపడడం కొనసాగిస్తుందా అన్నది భవిష్యత్‌లో తేలవలసిన అంశాలు. 2030 నాటికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హరిత పరివర్తన లక్షాలు సాధించాలన్న పట్టుదల ఉంటే ఈ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పరిష్కరించవలసి ఉంది. ఈ విషయంలో విధానాలతో స్పల్పంగా మార్పులు చేసుకునే సమయం ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News