ఓ బాలికను హత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఇరాన్ అధికారులు బహిరంగంగా మరణశిక్ష విధించారు. ఈమేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వాటి ప్రకారం .. బుకాస్‌కు చెందిన ఓ బాలికను అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తి దోషిగా తేలాడు. అతడికి బహిరంగంగా మరణశిక్ష విధించాలని భాధిత కుటుంబ సభ్యులు , ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. మార్చిలో అతడికి మరణశిక్ష ఖరారు కాగా, సుప్రీం కోర్టు కూడా దాన్ని సమర్థించింది.
భావోద్వేగాలతో ముడిపడిన కేసు కాబట్టి కఠినశిక్షపై నిర్ణయం తీసుకున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యుల కోరిక మేరకు శిక్షను విధిస్తున్నట్టు చెబుతూ తాజాగా దాన్ని అమలు చేశారు. ఇరాన్‌లో బహిరంగంగా మరణశిక్షలు విధించడం సాధారణమే. హత్య, అత్యాచారం వంటి తీవ్రత ఎక్కవ ఉన్న కేసుల్లో ఇలాంటి కఠినమైన శిక్షలను అమలు చేస్తారు. మానవహక్కుల సంఘాల ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువ మరణశిక్షలు అమలు చేసే దేశాల్లో ఇరాన్ రెండోస్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది.