హత్యాయత్నం కేసులో ఇద్దరు జెప్టో రైడర్లను అత్తాపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం…అత్తాపూర్ పిల్లర్ నంబర్ 203 వద్ద ఉన్న జెప్టో స్టోర్ వద్ద మహ్మద్ రెహాన్ డ్యూటీలో ఉన్నాడు. ఈ క్రమంలోనే స్టోర్ వద్దకు సులేమాన్, మరో రైడర్ యూనస్‌ను తీసుకుని వచ్చాడు. ఆర్డర్లు తక్కువగా ఉన్నాయని యూనస్‌ను ఎందు తీసుకుని వచ్చావని సులేమాన్‌ను రెహాన్ ప్రశ్నించాడు. దీంతో సులేమాన్ ఆగ్రహం చెంది రెహాన్‌ను దూషలాడి, చంపివేస్తానని బెదిరించాడు.
అంతటితో ఆగకుండా మరో ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి స్టోర్ వద్దకు రప్పించాడు. నలుగురు కలిసి రెహాన్‌పై దాడి చేశారు. యూనస్ పదునైన ఆయుధంతో రెహాన్ ఎడమ భుజం, తొడపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత బాధితుడు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని మహ్మద్ యూనస్, మహ్మద్ సులేమాన్ అలియాస్ సమీర్‌ను అరెస్టు చేయగా, మహ్మద్ ఇమ్రాన్, కాలీం పరారీలో ఉన్నారు. నిందితులపై బిఎన్‌ఎస్ 109(1), రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.