సెల్ఫీ పేరిట భర్తను కృష్ణా నదిలోకి ఓ భార్య తోసేసింది. అయితే, భార్యే తనను నదిలోకి తోసేందని బాధితుడు ఆరోపించగా, కాదు..కాదు..కాలు జారి నదిలో పడిపోయాడని ఆమె బంధువులకు ఫిర్యాదు చేయడం విశేషం. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటక రాష్ట్రం, రాయిచూర్ జిల్లా, కాడ్లూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బైక్‌పై కృష్ణా నది వంతెన మీదుగా వెళ్తున్నారు. నారాయణపేట జిల్లా, కృష్ణ మండలం, గుడెబల్లూరు పంచాయతీ పరిధిలో గల తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉద్ధృతంగా పారుతున్న కృష్ణ్ణా నది ప్రవాహాన్ని చూసిన భార్య సెల్ఫీ దిగుదామని భర్త తాయప్పను అడిగింది.
అందుకు సరేనన్న భర్త వంతెనను ఆనుకుని ఉన్న స్థలంలో నిలుచున్న క్రమంలో తనను భార్య నదిలోకి తోసేసిందని భర్త ఆరోపించాడు. అయితే, తనకు ఈత రావడంతో నది మధ్యలో ఉన్న గుండురాళ్ళపైకి చేరానని, లేకుంటే చనిపోయేవాడినని వాపోయాడు. అయితే, తన భర్త కాలు జారి కృష్ణా నదిలో పడిపోయాడని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఈ విషయం తెలిసి పలువురు గ్రామస్థులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని తాళ్ళ సహాయంతో బాధితుడి ప్రాణాలను కాపాడారు. నది నుంచి బయటకు వచ్చిన అనంతరం తన భార్య తనను చంపడానికే ఇలాంటి నిర్ణయం తీసుకుందని, వెంటనే ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.