మన తెలంగాణ/హైదరాబాద్: న్యాయవాద వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నద ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని, కొన్ని కేసుల విచారణ దశాబ్దాల పాటు సాగటం ఆందోళనకరమని పేర్కొన్నారు. నల్సార్ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవ కార్యక్రమానికి జస్టిస్ బీఆర్ గవాయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పీఎస్ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్‌పాల్ తదితరులు హాజరయ్యారు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా చాన్సెలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (తాత్కాలిక) జస్టిస్ సుజయ్ పాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ న్యాయవాదు లు నిరంతరం తమను తాము నిరూపించుకోవాలని, కోర్టు తీర్పులకు సంబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ప్రస్తుతం న్యాయవాద విద్యలో ప్రవేశించేవారి సంఖ్య పెరుగుతోందని, ఏఐ, డేటా ప్రైవసీ విషయంలో అనుకూల, ప్రతికూల ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. సరైన మార్గదర్శకత్వం ఉంటేనే నైపుణ్యం సాధించగలమని, మెంటార్‌షిప్‌ను ఒక బాధ్యతగా భా వించాలని కోరారు. వృత్తిని, చేసే పనిని ప్రేమించాలని, అప్పుడే సరైన ఫలితాలు పొందగలుగుతామన్నారు. యువ న్యాయవాదులకు న్యాయ రంగ ప్రవేశిస్తున్న విద్యార్థులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పలు కీలక సూచనలు చేశారు. నేటి ప్రపంచంలో న్యాయవ్యవస్థ ముందున్న సవాళ్లను గుర్తు చేసిన ఆయన మన దేశం వివిధ లీగల్ ఛాలెంజెస్‌ను ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో, న్యాయవాదులు, న్యాయ సేవలో ఉన్న వారు ‘ఎవరేం చెబుతున్నారు’ అనే విషయాన్ని క్షుణ్ణంగా వినడం చాలా ముఖ్యమన్నారు.
విదేశీ డిగ్రీల కోసం అప్పులు చేయవద్దని న్యాయ విద్యార్థులను, వారి కుటుంబాలను ఆయన హెచ్చరించారు. భారతదేశం నాణ్యమైన న్యాయ విద్యను అందిస్తుందని చెప్పారు. విదేశీ డిగ్రీలు ప్రతిభను పెంచుతాయనేది అపోహ అని, ఒకరి ప్రతిభ వారి పని ద్వారా నిరూపించుకోవాలని అన్నారు. విదేశీ డిగ్రీల కోసం కుటుంబాలపై అప్పుల భారం మోపవద్దని ఆయన సూచించారు. న్యాయ వృత్తిలో అంకితభావం , ప్రజాసేవ యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించారు. న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధస్సు (ఏఐ)ని ఉపయోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే తీర్పులను వేగంగా అందించడంలో సహాయపడుతుందని సీజేఐ తెలిపారు. మనం ఏ పని చేస్తున్నా, అది ఎంత మనసు పెట్టి చేస్తున్నాం అనేది ముఖ్యమని, న్యాయ రంగంలో విశ్వాసం, నిబద్ధత, ప్రజల సేవకే ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలని యువ న్యాయవాదులకు సందేశమిచ్చారు. నల్సార్ యూనివర్సిటీ తన స్థాయిని నిరూపించుకుంటూ న్యాయవిద్యా రంగంలో దేశానికి ప్రతిభావంతులైన న్యాయవాదులను అందించడంలో ముందుండుతుందని చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ విద్యార్థులను ఉద్దేశించి దిశానిర్దేశం చేయగా ఈ స్నాతకోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మాజీ న్యాయమూర్తులు, న్యాయ కోవిధులు, యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ శ్రీకృష్ణ దేవ రావుతో పాటు న్యాయవాదులు హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు న్యాయమూర్తులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గోల్డ్ మెడల్స్ బహూకరించారు. జస్టిస్ సుజయ్ పాల్ డాక్టరేట్ సాధించిన వారితో పాటు ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, బీఏ ఎల్‌ఎల్ బీ (హానర్స్) పీజీ డిప్లమా పొందిన విద్యార్థినీ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. చట్ట సంబంధమైన వివిధ అంశాలపై నిపుణులు రాసిన పలు పుస్తకాలను ఈ వేదికగా ఆవిష్కరించారు. ఈ స్నాతకోత్సవం సందర్భంగా డిగ్రీలు అందుకున్న విద్యార్థులు, వారి కుటుంబాల్లో ఉత్సాహం కనిపించింది. ముఖ్య అతిథుల ప్రసంగాలు యువతలో ఆశాభావాన్ని పెంపొందించాయి.