మన తెలంగాణ/సిద్దిపేట టౌన్: తమ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అద్భుతమైన కాళేశ్వరం ప్రా జెక్టు కూలిపోయిందని ఊరికే బద్నాం చేస్తున్నారని మాజీ మం త్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో 167 లబ్ధిదారులకు 38లక్షల 54వేల సిఎం సహాయ నిధి చెక్కులను ఆయన శనివారం పంపి ణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. -వర్షాలు పడతలేవు.. పత్తి చేనులు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రైతులు ఏం చేశారు.. కాళేశ్వరం ఏం చేసిం ది..- కెసిఆర్‌పై, తనపై కోపం ఉంటే కేసులు వెయ్’ అంటూ రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సిద్దిపేటకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
-మహారాష్ట్రలో వర్షాలు పడుతుంటే ఇవాళ గోదావరి నదిలో ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతున్నా కూడా రేవంత్ రెడ్డి మోటార్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటర్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగనాయక సాగర్ నిండిపోతుందని, అలానే అన్ని రిజర్వాయర్లు నింపుకోవచ్చాన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఊరికే బద్నాం చేస్తున్నారని,- మేడిగడ్డ బ్రిడ్జి పైన లారీలు, మోటార్లు నడుస్తున్నాయని, ఒకవేళ మేడిగడ్డ మొత్తానికే కూలితే మోటార్లు, లారీలు ఎందుకు నడుస్తున్నాయని ప్రశ్నించారు. రంగనాయక సాగర్ కాళేశ్వరం కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరం కాదా? కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా? ఇవేమీ చూడకుండా కాళేశ్వరం కూలిపోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
– అబద్ధాలు మాట్లాడటం తప్ప సిఎం రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. మైక్ కట్ చేయకుండా ఎంతసేపైనా మాట్లాడుదామని అసెంబ్లీ పెట్ట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. కృష్ణా నదిలోకి నీళ్లొచ్చి 36 రోజులైనా ఎందుకు కల్వకుర్తి మోటార్లు స్టార్ట్ చెయ్యలేదని, మోటార్లు ఆన్ చేస్తారా.. తాము చేయాలా అని ప్రశ్నిస్తే కల్వకుర్తికి మోటార్లు ఆన్ చేసారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే కెసిఆర్‌కి పేరు వస్తుందని ఓర్వలేక, ఆ బాధ తట్టుకోలేక రైతులకు నీళ్లు ఆపారని ఆరోపించారు. ‘కళ్ళ ముందు నీరు పోతున్నా కూడా రైతులకు నీళ్లు ఇస్తలేరని, మీరు ఇస్తారా.. మేమే రైతులతో కలిసి కటక వేయాలా ’ అని అన్నారు. కెసిఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు ఇస్తే రేవంత్ ఓట్లకు ఓట్లకు మధ్య ఇస్తున్నారని అన్నారు. రైతులు కొత్తగా కొనుక్కున్న భూమి రైతుబంధు పడతలేదు అంటున్నారని, రేవంత్ రెడ్డి అందరికీ ఇచ్చామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
కెసిఆర్ ట్రాక్టర్లు కొనిచ్చిండని, రేవంత్‌కు అందులో డీజిల్ కొట్టడానికి పైసలు లేవని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఉండంగా కెసిఆర్ కిట్ వస్తుండేదని ఇప్పుడు అది కూడా బంద్ అయిందన్నారు. సర్కారు దవాఖానాలలో మళ్ళీ రాకుండా చేసే పరిస్థితులున్నాయన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. రేవంత్‌కి మాటలెక్కువున్నాయి తప్ప చేతలు తక్కువ ఉన్నాయని అన్నారు. సిద్దిపేట పిల్లల కోసం తీసుకొచ్చిన వెటర్నరీ, డిగ్రీ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్ కి తీసుకుపోయారని అన్నారు. సిద్దిపేటకు అన్నీ బంద్ పెట్టిన కాంగ్రెస్ సర్కారును సిద్దిపేటలోనే బంద్ పెట్టాలన్నారు. మళ్లీ మన సిద్దిపేటకు పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ ప్రతిష్ట పెరగాలంటే కెసిఆర్ రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కడవెరుగు రాజనర్సు, మారడి రవీందర్ రెడ్డి, పాల సాయిరాం, గుండు భూపేష్, లక్కర్స్ ప్రభాకర్ వర్మ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.