పిల్లల భద్రత పట్ల
అప్రమత్తంగా ఉండాలంటూ
డిఫెన్స్ ల్యాబ్ స్కూల్
ప్రిన్సిపాల్ లేఖ భయం
వద్దని అటవీ శాఖ
అధికారుల భరోసా
మన తెలంగాణ/బాలాపూర్: రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ మండలంలోని కేంద్ర రక్షణ రంగ సంస్థ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సిఐ)లో రెండు చిరుతపులులు సంచారాన్ని అధికారులు గుర్తించారు. ఈ విషయమై చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఆర్‌సిఐలోని డిఫెన్స్ ల్యాబ్ స్కూల్ ప్రిన్సిపాల్ విడుదల చేసిన ప్రకటన స్థానికంగా కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం ఇక్కడ పనిచేసే వాచ్‌మెన్ జంతువుల సంచారాన్ని గమనించగా అవి చిరుతపులులు అయి ఉంటాయని భావించి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపాడు. కాగా, మరుచటి రోజు ఇక్కడ ఓ కుక్క అనుమానాస్పదంగా మృతి చెందడంతో చిరుతపులుల సంచారంపై అనుమానాలు బలపడ్డాయి.
దీంతో ఆర్‌సిఐ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆర్‌సిఐ ప్రాంగణంలోకి చిన్నపిల్లలను ఒంటరిగా పంపవద్దని డిఫెన్స్ ల్యాబ్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రకటన మేరకు ఆర్‌సిఐ, అటవీ శాఖల అధికారులతో పాటు బాలాపూర్ పొలీసులు అప్రమత్తం అయ్యారు. చిరుతపులుల సంచారం పట్ల ఆర్‌సిఐ పరిసరాల్లోని బాలాపూర్, మల్లాపూర్, వెంకటాపూర్, సుల్తాన్‌పూర్, కుర్మల్‌గూడ గ్రామాల ప్రజలు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. పులులను బంధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హితవు పలికారు.