మండి (హెచ్‌పి): హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమత్రి జైరాం ఠాకూర్ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడి.. మాజీ సిఎం కారును ఢీకొట్టాయి. అయితే, ఆయన సురక్షితంగా బయటపడటంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కొడచరియలు వాహనాన్ని ఢీకొనడానికి కొద్ది క్షణాల ముందు ఆయన కిందకు దిగడంతో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. మండి జిల్లా సెరాజ్ ప్రాంతంలోని కర్సోగ్ నుండి తునాగ్‌కు ఠాకూర్ తిరిగి వస్తుండగా శంకర్ డెహ్రా సమీపంలో ఈ సంఘటన జరిగింది.
ఆకస్మికంగా కొండచరియలు విరిగిపడటం ఆ ప్రాంతంలో ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సంఘటన జరిగిన కొద్దిసేపటికే, ధార్వార్ థాచ్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. రోడ్డు ధ్వంసం కావడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో సంఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక రెస్క్యూ, విపత్తు నిర్వహణ అధికార బృందాలు సహాయ చర్యలను చేపట్టాయి. అయితే, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో సహాయ చర్యలకు అంతరాయం కలుగుతోంది.