Monday, July 14, 2025

బాకీ డబ్బుల కోసం బాలుడి కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

డబ్బుల కోసం మైనర్ బాలుడి కిడ్నాప్‌కు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాలోని ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులను హన్మకొండ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కిడ్నాపర్ల చెర నుండి బాలుడిని సురక్షితంగా రక్షించి, కేసును ఛేదించారు. నిందితుల నుండి ఒక ఆటో, ఒక కత్తి, రెండు పెట్రోల్ బాటిళ్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ ఎసిపి నరసింహారావు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ప్రధాన నిందితురాలైన పూరి పద్మ హనుమకొండలో నివాసం ఉంటూ బ్రాహ్మణవాడలోని క్యాటరింగ్ నిర్వహించే రమణ అనే వ్యక్తి వద్ద రోజువారీ కూలిగా పనిచేసేది. కొన్నేళ్ల పాటు పనిచేసిన వారి మధ్య ఆర్థికపరమైన గొడవలు తలెత్తాయి. దీంతో ఆమె మళ్లీ తన స్వగ్రామానికి వెళ్ళిపోయింది.

అయితే, రమణ నుండి ఆమెకు డబ్బులు రావాల్సి ఉంది. తన డబ్బులు తనకు తిరిగి రావాలంటే రమణ వద్ద ఉండే అతని దగ్గర బంధువు మైనర్ బాలుడిని కిడ్నాప్ చేయాలని కుట్ర పన్నింది. తన కుమారులైన రాజు, శ్రీకాంత్‌తో పాటు మరో నిందితురాలు జ్యోతికి వివరించడంతో, ఈ నలుగురు నిందితులు మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల నాలుగవ తేదీన సదరు మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై బయటకి వచ్చిన క్రమంలో ఈ ముఠా సభ్యులు నయీమ్ నగర్ ప్రాంతంలో బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని ములుగు మార్గం మీదుగా అశ్వాపురంనకు చేరుకున్నారు. నిందితులు కిడ్నాప్ గురైన బాలుడితో అతని తల్లికి ఫోన్ చేయించి బాలుడి వరసకు మామ అయిన రమణ నుండి 12 లక్షల రూపాయలు ఇస్తే విడుదల చేస్తామని బెదిరించారు. అశ్వారావుపేట, కొత్తగూడెం, కర్కగూడెంతో పాటు మంగపేట ప్రాంతాల్లోని పరిచయస్తుల ఇండ్లలో బాలుడిని రహస్యంగా ఉంచారు.

ఇదే సమయంలో నిందితులు తమ వద్ద ఉన్న కర్రలతో బాలుడిని కొడుతూ పెట్రోల్ పోసి చంపుతామని కత్తితో బెదిరించారు. ఇలా చేస్తున్నా బాలుడి కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో డబ్బులు ఇవ్వవలసిన రమణని కూడా కిడ్నాప్ చేస్తే తమ డబ్బులు తిరిగి వస్తాయని అనుకున్నారు. ఆదివారం ఉదయం ములుగు రోడ్డు మీదుగా అవుటర్ రింగ్ రోడ్డులో ఆటోలో ప్రయాణించారు. అదే సమయంలో హన్మకొండ పోలీసులు యాదవనగర్ పెట్రోల్ పుంపు వద్ద రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా చూసి భయపడిన నిందితులు ఆటోను వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు, పద్మ, జ్యోతి, రాజును పట్టుకోగా మరో నిందితుడు శ్రీకాంత్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. పట్టుబడిన ముగ్గురు నిందితులను అదుపులో తీసుకొని విచారించగా బాలుడిని కిడ్నాప్ చేసినట్లు అంగీకరించారు.

దీనితో ముగ్గురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో నిందితుడు శ్రీకాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాలుడిని అతని తల్లికి అప్పగించారు. కాగా, బాలుడి కిడ్నాప్ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్, ఎస్‌ఐ కిషోర్, సల్మాన్ పాషా, కానిస్టేబుల్ అశోక్, కరుణాకర్, సతీష్, వినూష, కారుణ్య, హోమ్ గారడ్స్ రవి యుగేందర్‌ను ఏసిపి అభినందించారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News