న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రతలో భారతీయ రైల్వే తన వేగం పెంచింది. రైలు డోర్ల వద్ద సిసిటీవీల ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకున్నా రు. దొంగలు, జులాయిలు ఎక్కువగా మహిళల మెడల్లో నుంచి నగలు, బ్యాగులు లాక్కుని వెళ్లుతున్న వైనం గుర్తించి నివారణకు చర్యలు చేపట్టారు. బోగీకి ఉండే రెండు డోర్లకు ఒకొక్కటి చొ ప్పున వీటిని నెలకొల్పుతారు. భద్రతా చర్యల్లో భాగంగా మొత్తం 74వేల కోచ్‌లకు సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధిత ఏర్పాటుకు ఆమోదం తెలిపారని రైల్వే అధికారులు ప్రకటన వెలువరించారు. ప్రయాణికుల కదలికలను, ప్రత్యేకం గా అనుమానాస్పద వ్యక్తుల సంచారాన్ని పసిగట్టేందుకు, నేరాలు జరిగినప్పుడు నేరస్తులను పట్టుకునేందుకు
ఈ కెమెరాలు ఉపయోగపడుతాయి. ప్రయాణికుల మాదిరిగా లోపలికి చేరే దుండగులు, ముఠాలను గుర్తించేందుకు సకాలంలో నివారణ చర్యలకు ఈ కెమెరాలతో వీలేర్పడుతుందని అధికారి ఒకరు తెలిపారు.
నార్తర్న్ రైల్వే లోకో ఇంజిన్లు, కోచ్‌లకు ఇప్పుడు ప్రయోగాత్మక రీతిలో అమర్చిన సిసిటీవీ కెమెరాల ఏర్పాట్లు విజయవంతం అయిన దశలో మొత్తం బోగీలకు ఈ ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. వంద కిలోమీటర్ల వేగంతో సాగే రైళ్లలో కూడా దుండగుల ముఖాలు స్పష్టంగా కనబడేలా సరైన దృశ్యీకరణ ఉండే కెమెరాలను ఏర్పాటు చేస్తారని అధికారులు తెలిపారు. వెలుతురు తక్కువ ఉండే సమయంలో కూడా ఈ సిసిటీవీ కెమెరాలు శక్తివంతంగానే పనిచేస్తాయి. ఇక కెమెరాల ఏర్పాటు ద్వారా లభ్యం అయ్యే డాటాతో సక్రమ సత్వర రీతిలో నేరాలను చేదించేందుకు, నేరగాళ్లను పట్టుకునేందుకు అవసరం అయిన రీతిలో ఎఐ పరిజ్ఞానం వాడుకోవాలని రైల్వే మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. కేవలం డోర్ల వద్ద సిసిటీవీల ఏర్పాట్లు వల్ల లోపల ప్రయాణికుల గోప్యతకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేవలం గేట్ల వద్ద దుండగులను అదుపులో పెట్టేందుకు ఇవి ఉపయోగపడుతాయని వెల్లడించారు.