సాధారణంగా ఒక నటుడు విలన్‌గా మెప్పించగలడు లేదంటే కమెడియన్‌గా నవ్వించగలడు. కానీ కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) అత్యంత క్రూరమైన విలనిజంను పండించడంతో పాటు, కడుపు పగిలి పోయేంతగా నవ్వించగలడు. అంతే కాకుండా కోట సెంటిమెంట్‌తో కన్నీళ్లు తెప్పిస్తాడు, హార్రర్ సినిమాలతో భయపెట్టగలడు. ఇలా ఇన్ని రకాల పాత్రలు చేయడం కేవలం ఆయనకు మాత్రమే చెల్లింది. తెలుగు సినీ రంగంలో నట ‘కోట’గా నిలిచాడు కోట శ్రీనివాసరావు. ఆయన సినీ జీవితంలో అహనా పెళ్లంట, ప్రతిఘటన, యుముడికి మొగుడు, ఖైదీ నెం.786, శివ, బొబ్బిలిరాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం, అత్తారింటికి దారేది.. మరచిపోలేని చిత్రాలుగా నిలిచిపోయాయి.
అరుదైన నటుడిగా : ఎస్వీ రంగారావు, రావు గోపాలరావు.. ఆ తరువాత తెలుగు సినిమాల్లో కొద్దిమంది నటులే ప్రత్యేక గుర్తింపుతో నిలిచారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుతో తలపడగల నటుడిగా కోట శ్రీనివాసరావు పేరుగాంచారు. ఆయన పలుసార్లు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా కనిపించడమే కాకుండా, పలు పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
ఎన్నో సినిమాల్లో అత్యంత క్రూరమైన విలనిజంను పండించడం ద్వారా విలన్‌గా టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం ( country Gain popularity) చేసుకున్నాడు. తెలుగు భాషలోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ విలన్‌గా నటించడం ద్వారా అక్కడి ప్రేక్షకులకు చేరువయ్యాడు. విలన్‌గా ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్న కోట శ్రీనివాసరావు నటించిన నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో కోట పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆయన నటన వల్ల, ఆయన విలనిజం వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. విలన్‌గా నటించిన కోట శ్రీనివాసరావు కామెడీతోనూ మెప్పించాడు. బ్రహ్మానందం, బాబు మోహన్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు.
ఒకప్పుడు కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబో కామెడీ సీన్స్ ఖచ్చితంగా పెద్ద హీరోల సినిమాల్లో ఉండేవి. వీరిద్దరి కాంబో కామెడీ ఇప్పటికీ యూట్యూబ్ ద్వారా చూస్తూ నవ్వుకునే వారు ఎంతో మంది ఉంటారు. బాబు మోహన్ అన్నా అన్నా… అంటూ కోటా శ్రీనివాసరావుతో చేసిన సినిమాలు అల్టిమేట్ కామెడీని పండించాయి. బ్రహ్మానందంతో కలిసి కూడా కోటా శ్రీనివాసరావు కామెడీ సీన్స్ చేసి నవ్వించాడు. అతడు సినిమాలో కోట శ్రీనివాసరావు విలన్‌గా కనిపిస్తూనే తన మార్క్ డైలాగ్ డెలివరీతో నవ్వు తెప్పించాడు. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించాడు. ఇంకా ఎన్నో సినిమాల్లోనూ సెంటిమెంట్‌తో మెప్పించాడు.
హార్రర్ సినిమాలో షాకింగ్ రియాక్షన్‌తో కోట భయపెట్టిన సినిమాలు ఉన్నాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఇలా ఒకే నటుడు విలన్‌గా, కమెడియన్‌గా, సెంటిమెంట్ పాత్రలో, హార్రర్ పాత్రలో నటించిన దాఖలాలు చాలా అరుదుగా ఉంటాయి. అందుకే కోట శ్రీనివాసరావు ప్రపంచ సినీ చరిత్రలో అరుదైన నటుడు అనడంలో సందేహం లేదు. కోట తెలుగు నటుడు అయినందుకు తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం. చివరి రోజుల్లోనూ కోటా శ్రీనివాసరావు కెమెరా ముందుకు వచ్చి తన వంతుగా సినిమాలు చేశాడు. వీల్ చైర్‌లో కూర్చుని మరీ నటించిన కోట శ్రీనివాసరావు మృతి చెందడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
నాటకాల నుంచి సినిమాల్లోకి… : కోట శ్రీనివాసరావుకు నాటకాలు అంటే ఎంతో ఇష్టం. 1977లో చేసిన ’ప్రాణం ఖరీదు’ అనే నాటకం అతని జీవితాన్ని మార్చేసింది. అదే సినిమాగా మారి 1978లో కోట వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి కూడా ఆ సినిమా ద్వారానే పరిచయమయ్యారు. విలన్, కమేడియన్‌గా విశ్వరూపం…: కేవలం నటుడే కాదు, విలనిజానికి కొత్త నిర్వచనం, విలన్ పాత్రలకు కొత్త అర్థం చెప్పిన వ్యక్తిగా కోట గుర్తింపు పొందారు. ప్రతిఘటన, వందేమాతరం సినిమాల్లో ఆయన చూపిన క్రూరత్వం ప్రేక్షకులు అసహ్యించుకునేలా చేసింది. ముఖ్యంగా మంత్రి కాశయ్య పాత్రలో తెలంగాణ యాసతో రాజకీయ అవినీతిపై చూపిన విమర్శ ఆయన నటనలోనే కనిపించింది. అప్పటి వరకు నెమ్మదిగా సాగిన ఆయన కెరీర్, ఈ సినిమాతోనే బిగ్ బ్రేక్ దక్కింది. వెంకటేష్ హీరోగా నటించిన గణేష్ సినిమాలో కోట శ్రీనివాసరావు కనబర్చిన విలనిజంను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. ’ఆమె’ సినిమాలో ఆయన నటనను మహిళ ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు.
కోట పాత్రలు కేవలం విలన్ కోణంలోనే కాదు, కామెడీ జోనర్‌లోనూ ఒక ట్రెండ్ సెట్ చేశాయి. బాబూ మోహన్‌తో కలిసి చేసిన సినిమాలు తెలుగువారికి ఆల్ టైమ్ పేవరేట్. వీరి మధ్య కెమిస్ట్రీ, టైమింగ్, డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా నిలిచింది. అహనా పెళ్లంట, మామగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషిస్తూ నవ్వులు పూయించారు. ఇక కోట ఒక ఇంటర్వ్యూలో ‘నాకు సినిమాలంటే అంతగా ఆసక్తి ఉండదు.. నాటకాలంటేనే ఇష్టం ఎక్కువ’ అని చెప్పడం విశేషం. అయినా కూడా జీవితంలోని పాఠాలను నటన ద్వారా పలికిస్తూ 750కి పైగా చిత్రాల్లో నటించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. సినిమా అంటే అభిమానం కాకపోయినా, నటనంటే ప్యాషన్ ఉండటం వల్లే కోట శ్రీనివాస్ సినీ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు.
గుర్తుండిపోయే లక్ష్మీపాత్ర: ‘ఆహా నా పెళ్లంట’ సినిమాలో కోటా శ్రీనివాసరావు పోషించిన లక్ష్మీపతి పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుంది. విలన్‌గా వరుస సినిమాలు చేస్తున్న కోటా శ్రీనివాస రావును తీసుకు వచ్చి లక్ష్మీపతి పాత్ర చేయించడం సాహసం అనే అభిప్రాయం వ్యక్తం అయిందట. దర్శకుడు జంధ్యాల గట్టి నమ్మకంతో లక్ష్మీపతి పాత్రను కోటా శ్రీనివాసరావు తో చేయించారు. ఆహా నా పెళ్లంట సినిమా నిర్మాత రామానాయుడు సైతం ఒకింత అనుమానం వ్యక్తం చేశారట. పిసినారి గా నటిస్తూ నవ్వించడంతో పాటు, ఆయన ప్రవర్తనతో అస హ్యం కలిగించాల్సి ఉం టుంది. ఆ పాత్రను కోటా అద్భుతంగా పోషించాడు. ఒక మోస్తరు వర కు నవ్వు తెప్పించిన పిసినారితనం హద్దులు దాటి అసహ్యం కలిగించేలా చేశాడు.
పద్మశ్రీ, 9 నంది అవార్డులు : కోట శ్రీనివాసరావు తన నాలుగు దశాబ్దాల సినీ జీవితం మొత్తం తన నటనతో ఆకట్టుకున్నారు. నటన పట్ల ఆయన అంకితభావం ఫలితంగా ఆయనకు 2015లో పద్మశ్రీ లభించింది. అంతేకాకుండా, తొమ్మిది నంది అవార్డులు పొందడం ఆయన స్థాయిని తెలియజేస్తుంది. కోట నటించిన ప్రతి పాత్ర ప్రేక్షకుడిలో ఒక ముద్ర వేసింది.
నటన ఉన్నంత కాలం కోట ఉంటారు: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. “లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి కోట శ్రీనివాస రావు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు కోట. కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది”అని అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కోట శ్రీనివాసరావుతో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. నా మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయి’లో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు.
ఆ తరవాత గోకులంలో సీత, గుడుంబా శంకర్, అత్తరింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో కలసి నటించాము. కోట శ్రీనివాసరావు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి”అని తెలియజేశారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల నందమూరి బాల కృష్ణ సంతాపం తెలియజేశారు. “నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు”అని తెలిపారు. బ్రహ్మానందం మాట్లాడుతూ “కోట శ్రీనివాసరావు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా.
వందల సినిమాల్లో కలిసి నటించాం.నేను, కోట, బాబు మోహన్ కలిసి రోజుకు18 గంటలు నటించాం. నటన ఉన్నంత కాలం ఆయన ఉంటారు”అని తెలియజేశారు. రవి తేజ మాట్లాడుతూ “కోట శ్రీనివాసరావుని చూస్తూ, ఆరాధిస్తూ.. ఆయన నుంచి నేర్చుకుంటూ పెరిగాను. ఆయన నా కుటుంబంలో వ్యక్తిలాంటి వారు. ఆయనతో కలిసి పని చేసిన క్షణాలు.. నాకు తీపి జ్ఞాపకాలు”అని చెప్పారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీకాంత్, విష్ణు మంచు, రాజేంద్రప్రసాద్, బాబుమోహన్, ప్రకాష్‌రాజ్, ఆర్.నారాయణమూర్తి, తనికెళ్ల భరణి, సాయి దుర్గ తేజ్ – తదితరులు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేశారు.