Monday, July 14, 2025

భారత్‌ను ఊరిస్తున్న గెలుపు

- Advertisement -
- Advertisement -

లండన్: లార్డ్ టెస్టులో భారత బౌలర్లు (Indian bowlers) చెలరేగారు. మూడోటెస్ట్ నాలుగో రోజూ పదునైన బంతులతో ఆతిధ్య జట్టు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వాషింగ్టన్ సుందర్(4/22) నాలుగు వికెట్లతో రాణించడంతో 2/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 62.1 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్ చేసింది. జోరూట్(40), బెన్ స్టోక్స్(33)లు ఇంగ్లండ్ బ్యాటర్లలో టాప్ స్కోరర్లుగా నిలిచారు. టీమిండియా బౌలర్లలో సుందర్‌కు తోడుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. దాంతో భారత్ ముందు 193 పరుగుల లక్ష్యం నమోదైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. క్రీజులో కెఎల్ రాహుల్(33) కొనసాగుతున్నాడు. గెలుపుకు భారత్ 135 పరుగుల దూరంలో ఉంది.
బౌలర్లు భళా..
నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌కు మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ నిప్పులు చెరగడంతో తొలి సెషన్‌లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. బెన్ డకెట్(12), ఓలీ పోప్(4)లను సిరాజ్ పెవిలియన్ చేర్చితేజాక్ క్రాలీ(22)ని నితీష్ కుమార్ రెడ్డి ఔట్ చేశాడు. హ్యారీబ్రూక్(23)ను ఆకాశ్ దీప్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బెన్‌స్టోక్స్, జో రూట్ ఆచితూచి ఆడి మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. దాంతో ఇంగ్లండ్ 98/4 స్కోర్ వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. ఇక రెండో సెషన్‌లో ఆచితూచీ ఆడుతున్న జోరూట్, బెన్‌స్టోక్స్ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. మరోవైపు భారత బౌలర్లు పదేపదే ఇంగ్లండ్ బ్యాటర్లను బీట్ చేశారు.

ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్‌లో స్టోక్స్, జోరూట్ పరుగుల తీయడానికి చాలా కష్ట పడ్డారు. ఇక సమయంలో రెండో సెషన్ ముగుస్తుందనగా.. వాషింగ్టన్ సుందర్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. జిడ్డు బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న రూట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన జెమీ స్మిత్(8)ను కూడా వాషింగ్టన్ సుందర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 175/6 స్కోర్‌కు టీ బ్రేక్‌కు వెళ్లింది. ఆఖరిసెషన్ ఆరంభంలోనే బెన్ స్టోక్స్(33) కూడా వాషింగ్టన్ సుందర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే బ్రైడన్ కార్స్(1)ను బుమ్రా తన మార్క్ యార్కర్‌తో బోల్తా కొట్టించాడు. క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ పంపాడు. తన మరుసటి ఓవర్‌లో క్రిస్‌వోక్స్(10)ను సయితం బుమ్రా బౌల్డ్ చేయగా.. షోయబ్ బషీర్(2)ను సుందర్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News