ముంబై: మాజీ స్టార్ బ్యాటర్ అజింక్య రహానె (Ajinkya Rahane) టీమిండియాకు మళ్లీ ఆడలనే తన కోరికను బయటపెట్టాడు. టెస్టులో భారత్ తరఫున బరిలోకి దిగాలని ఉందని రహానె వెల్లడించాడు. అయితే ఈ విషయంపై సెలక్షన్ కమిటీతో మాట్లాడాలని ప్రయత్నించినా కమిటీ నుంచి ప్రతి స్పందన రాలేదని కీలక వ్యాఖ్యలు చేశాడు. అయినా తనకు టెస్టుల్లో ఆడటం చాలా ఇష్టమని అందుకే ఆటపై నిరంరం దృష్టిసారించి ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపాడు. 37 ఏళ్ల రహానె ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేక పోయాడు. మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకోవడానికి నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. ఇందు కోసం ముంబై జట్టులో చేరి దేశీయ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లార్డ్స్ మైదానంలో ఓ స్పోర్ట్ టివితో మాట్లాడాడు. ‘నేను ఇంకా టెస్ట్ క్రికెట్ (still playing Test cricke) ఆడాలనుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్ పట్ల నాకు చాలా ఆసక్తి ఉంది’ అని అన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రహానె జట్టులోకి తిరిగిరావడానికి అవకాశం ఉన్నా, ఇంగ్లండ్‌తో ఆడిన అనుభవం ఉన్నప్పటికీ భారత సెలక్షన్ కమిటీ యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చింది. దీంతో రహానె జట్టు స్థానం కోల్పోవలసి వచ్చింది. 2013లో అరంగేట్రం చేసిన రహానే, ఇప్పటి వరకు 85 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడి 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలతో 5077 పరుగులు సాధించాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించిన రహానే.. 11 ఇన్నింగ్స్‌లో 214 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.