హైదరాబాద్: కేంద్రనాయకత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర బిజెపి నేతలపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని కులగణన కూడా నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను బిజెపి నేతలు వ్యతిరేకిస్తున్నారా? అని బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించటం లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రపతితో ఆమోదింపచేసి..9వ షెడ్యూల్ లో చేర్పించాలని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం లేదా అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలియజేశారు.
బిఆర్ఎస్ బిజెపిలో ఉన్న బిసి నేతలు వాళ్ల అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని, బిసిల రిజర్వేషన్లకు( BC reservations) అడ్డుపడే పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. బిసిల రిజర్వేషన్లపై బిజెపి నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కులగణన చూసిన తర్వాతే కేంద్రం కళ్లు తెరచిందని, తెలంగాణ ఒత్తిడితోనే కేంద్రం జనగణనతో పాటు కులగణనను ప్రకటించిందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ అధ్యక్ష పదవి బిసిలకు ఎందుకు ఇవ్వరు? అని పొన్నం నిలదీశారు. వీలైతే మంచి సలహా ఇవ్వండని.. రిజర్వేషన్లకు అడ్డుపడొద్దని సూచించారు. బిఆర్ఎస్, బిజెపి నేతలు ఒకేలా మాట్లాడుతున్నారని, రిజర్వేషన్లపై ఏమైనా అనుమానం ఉంటే చెప్పండని అన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియకు అడ్డుపడితే సహించేది లేదని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.