మన తెలంగాణ/హైదరాబాద్ : మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని అడుగు బయటపెట్టొద్దని కెసిఆర్ సంకల్పిస్తే.. చివరికి మహిళలు బిందెలతో నీరు తెచ్చుకుని.. వరి నారు కాపాడుకునే పరిస్థితి కల్పిస్తావా..? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో బిందె సేద్యమా…ఎంతటి దుస్థితి తీసుకొచ్చావని సిఎంను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే తాగునీటి కోసం తండ్లాడుతున్న అక్కాచెల్లెళ్లకు ఈ కొత్త కష్టాలేంటి..? అని అడిగారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని రంగధామునిపల్లిలో ట్రాన్స్ ఫార్మర్ చెడిపోయి 15 రోజులైనా మరమ్మత్తు చేయించే తీరిక లేదా..? అని నిలదీశారు.
ఏడాదిన్నరగా మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు మరమ్మత్తు చేయడం చేతకావడం లేదు అని, చివరికి ట్రాన్స్ ఫార్మర్లు కూడా రిపేర్ చేయించే సత్తా లేదా..? అని ప్రశ్నించారు. సాగునీటి వసతి కల్పించకుండా ఇప్పటికే చేతులెత్తేశారని, కనీసం కరెంట్ మోటర్లతో పంట కాపాడుకుందామంటే కూడా ఇన్ని కష్టాలా..? అని అడిగారు. బిఆర్‌ఎస్ హయాంలో పెరిగిన భూగర్భజలాలను వాడుకునే అవకాశం లేకుండా చేయడం దుర్మార్గం కాక మరేంటి..కళ్లముందే వరినారు ఎండిపోతుంటే తట్టుకోలేక.. బిందెలతో ఆడబిడ్డలు పడుతున్న అగచాట్లు ఈ ముఖ్యమంత్రికి కనిపించడం లేదా..? అని నిలదీశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు.. తాగునీటితోపాటు సాగునీటికి కూడా బిందెలు మోస్తున్న ఈ ఆడబిడ్డల బాధలు తీర్చే సోయి ఈ సిఎంకు ఎప్పుడొస్తుందో అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ కుట్రలు చేధిస్తాం.. రైతన్నల కోసం పోరాడుతాం
కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయకుండా చేసిన సర్కార్ నిర్లక్ష్యం వల్ల కాలువల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు పారుతున్నాయని కెటిఆర్ మండిపడ్డారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని దండగ చేశారని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పాలనలో వచ్చిన నీళ్లు.. కాంగ్రెస్ పాలనలో ఎందుకు రావడం లేదని రైతులే ప్రశ్నిస్తున్నారన్నారు. కాలం కాటేయడం లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కాటేస్తున్నదని, కరువు కాటేయడం లేదు.. కాలువల్లో నీళ్లు పారించకుండా కాంగ్రెస్ కాటేస్తున్నదని పేర్కొన్నారు. అద్దాలమేడలో ఊరేగుతున్న అబద్దాల కాంగ్రెస్ మూలంగా అంధకారంలో తెలంగాణ రైతన్న ఆందోళన చెందుతున్నారని విమర్శించారు.
దశాబ్దాల పాలనలో దండగ చేసిన వ్యవసాయాన్ని దశాబ్ద బిఆర్‌ఎస్ పాలనలో పండగ చేస్తే .. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి దండగ చేశారని ఆరోపించారు. కానీ పండగల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం
ఊరేగుతున్నదని అన్నారు. దాదాపు ఆరువందల మీటర్ల ఎత్తున ఎగిసిన కాళేశ్వరం నీళ్లు సుమారు 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్ మండలంలో రావిచెరువు వరకు చేరి రైతుల పొలాలను తడిపిన నీళ్లు నేడెందుకు పారడం లేదని రైతన్నలు ప్రశ్నిస్తున్నారన్నారు. శ్రీరాంసాగర్ కింద 2001లో పూర్తయిన కాకతీయ వరద కాలువ 22 ఏళ్ల తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల మూలంగా 153 కిలోమీటర్లు ప్రయాణించి చివరి ఆయకట్టుకు చేరాయని, కానీ నేడు మేడిగడ్డ మరమ్మతులు చేయకుండా, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసి సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. వ్యవసాయంపై కక్షగట్టిన కాంగ్రెస్ సర్కార్ రైతన్నలకు శిక్ష వేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను చేధిస్తాం. తెలంగాణ రైతన్నలను కాపాడుకునేందుకు నిరంతరం పోరాడతాం అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.