Wednesday, July 16, 2025

బహుభాషా నటి.. నవరసాల్లో మేటి

- Advertisement -
- Advertisement -

భారతీయ సినిమా చరిత్రలో మహిళా నటీనటులకు గౌరవస్థానం అందించిన కొద్ది మందిలో బి. సరోజాదేవి పేరు ప్రశస్తంగా నిలుస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో విశిష్టపాత్రలు పోషించి నాలుగు దశాబ్దాలపాటు అగ్రనటిగా వెలిగిన నటి మణి సోమవారం తెల్లవారుజామున బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం సినీలోకానికి తీరని లోటు, అభినయ కళకు వేదనాత్మక విరామం. సొగసైన రూపం, సంయమనతో కూడిన నటన, సుస్థిర వ్యక్తిత్వం ఆమెకు విశేష గౌరవాన్ని, అపారమైన అభిమానాన్ని తెచ్చిపెట్టాయి. 1938 జనవరి 7న కర్ణాటకలోని కుణిగల్ వద్ద జన్మించిన బంగారమ్మ సరోజాదేవి, బాల్యంలోనే కళారంగంవైపు ఆకర్షితమయ్యారు. సంగీత పరిచయం, నాట్యనైపుణ్యం, వచనశక్తి ఆమెను సినీరంగానికి అద్భుతంగా తీర్చిదిద్దాయి. చిన్నవయస్సులోనే వెండితెరపై అడుగుపెట్టి, 13వ ఏట మొదటి చిత్రం ద్వారా ప్రయాణం ఆరంభించి, నిరంతరం అభివృద్ధి చెందుతూ దేశవ్యాప్తంగా అగ్రనటిగా వెలిగారు.

తెలుగు చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు సాంప్రదాయ స్త్రీల శక్తి శాలిత్వాన్ని, త్యాగ వృత్తిని, ప్రేమను ప్రతిబింబించేవిగా ఉండేవి. ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రంలో ఆమె పోషించిన రుక్మిణీ పాత్రలో భక్తి, భార్యాధర్మం, మానసిక స్థైర్యం ఆమె అభినయాన్ని ఉద్దీపనగా తీర్చిదిద్దాయి.(made acting stimulus) ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో సుభద్ర పాత్రలో ప్రేమ, ఆత్మాభిమానాన్ని ఆమె అద్భుతంగా ఆవిష్కరించారు. ‘వాసంతి’, ‘పూజా ఫలము’, ‘భార్యాభర్తలు’, ‘సభాశ్ మీనా’ వంటి చిత్రాల్లో ఆమె పాత్రలు మధ్యతరగతి మహిళల భావోద్వేగాల మేళవింపుగా నిలిచాయి. భూకైలాస్, సీతారామకళ్యాణం, జగదేకవీరుని కథ, ఆత్మబలం, దాగుడు మూతలు, భాగ్యచక్రం, మాయని మమత, పండంటి కాపురం, శ్రీరామాంజనేయ యుద్ధం లాంటి ఎన్నో సూపర్ హిట్స్ లో భాగం పంచుకున్నారు.

కన్నడలో ఆమె రాజ్‌కుమార్‌తో జతగా చేసిన ‘భక్త కనకదాస’, ‘సంతాన’, ‘నవశక్తి నందన’, ‘సత్యహరిశ్చంద్ర’, ‘బంగారద మనె’ వంటి చిత్రాల్లో ఆమె ప్రదర్శించిన గంభీరత, సాంప్రదాయిక విలువల్ని నిలబెట్టే నటనా శైలి విశేషంగా ప్రశంసలు పొందింది. ‘భక్త ప్రహ్లాద‘ వంటి పౌరాణిక చిత్రాల్లో ఆమె శాంత భావన కలిగిన, తల్లి పాత్రలను అత్యద్భుతంగా పోషించారు. ఆమె ముఖకవళికలు, కళ్లతో చెప్పే భావాలు, సున్నితమైన అనుభూతులను సులభంగా ఆవిష్కరించే శైలి కన్నడ ప్రేక్షకులను ఉప్పొంగేలా చేసింది. తమిళ చిత్రాల్లో ఆమె శివాజీ గణేశన్, ఎంజిఆర్ వంటి మహానటులతో కలిసి ‘తిలకం’, ‘కల్పకమాలై’, ‘పార్థిబన్ కనవు’, ‘పెరియతలైవన్’, ‘వాలిబన్’, ‘అందమైన పెళ్లం’, ‘తంగవీణై’ వంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి, కథానాయిక పాత్రలకు ఉన్న పరిమితులను అధిగమించారు. పార్థిబన్ కనవులో ఆమె పోషించిన చారిత్రక పాత్ర గంభీరంగా ఉండటమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

వాలిబన్ వంటి కమర్షియల్ చిత్రాల్లోనూ ఆమె గ్లామర్‌తో పాటు విలువైన భావాలను ప్రసారం చేయగల నైపుణ్యం కలిగి ఉన్నారనిపించారు. హిందీ నటులైన షమ్మీ కపూర్, మనోజ్ కుమార్, బిశ్వజీత్, జైరాజ్, రాందయాల్ శర్మ, శరత్ సక్సేనా వంటి వారితో కలిసి నటించారు.1961లో వచ్చిన ‘పహలే మౌసమ్’ చిత్రంతో ఆమె హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టారు. షమ్మీ కపూర్ నటించిన ఈ చిత్రంలో ఆమె పాత్ర సున్నితమైన భావావేశాలతో ఆకట్టుకుంది. అదే సంవత్సరంలో విడుదలైన ‘బహు రూపియా’ అనే చిత్రంలో ఆమె మనోజ్ కుమార్‌తో కలిసి నటించి, మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో గంభీరమైన పాత్రను సమర్థంగా పోషించారు. 1963లో విడుదలైన ‘బేగునాహ్’ చిత్రం ఆమె హిందీ సినీ ప్రస్థానంలో ఒకమైలురాయి. ఇందులో బిశ్వజీత్ కథానాయకుడిగా నటించగా, మదన్ మోహన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలతో ఆమె హావభావాలు అద్భుతంగా మిళితమయ్యాయి.

దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ‘భారత్ మాతా’ (1965) చిత్రంలో ఆమె త్యాగమూర్తిగా, దేశాన్ని మించిన ప్రేమను ప్రదర్శించే భార్య పాత్రను పోషించారు. ఆమె హావభావాలు ఈ చిత్రంలో అత్యంత భావోద్వేగంతో నిండి ఉండేవి. 1967లో విడుదలైన ‘స్వర్ణ సుందరి’ చిత్రంలో జైరాజ్‌తో కలిసి నటించిన ఆమె, సంగీతం, నాట్యం, శృంగారాభినయం కలగలిపిన పాత్రలో తన నటనా ప్రతిభను సమగ్రంగా ఆవిష్కరించారు. 1969లో వచ్చిన ‘పరిణయ్’ చిత్రంలో శరత్ సక్సేనా సరసన విద్యావంతురాలైన భార్య పాత్రను పోషించిన ఆమె నటన సామాజిక విలువల పట్ల స్పష్టమైన వ్యక్తీకరణగా నిలిచింది. పద్మశ్రీ (1969), పద్మభూషణ్ (1992) వంటి దేశీయ గౌరవాలతోపాటు, తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి, కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ పురస్కారం, కర్ణాటక రత్న, దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డు వంటి అనేక బహుమతులు ఆమెను గౌరవించాయి.

కేంద్ర ప్రభుత్వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జ్యూరీ సభ్యురాలిగా ఆమె సేవలందించారు. ఆమె వ్యక్తిగత జీవితం కూడా సంతోషకరంగా సాగింది. శ్రీహర్షను వివాహం చేసుకున్న ఆమె, కుటుంబాన్ని పరిరక్షించడంలోను, సినీ జీవితాన్ని కొనసాగించడంలోను సుస్థిరంగా ముందుకు సాగారు. ఆమె నటనా శైలికి రూపం గల కావ్యం అనిపించేది – అద్భుతమైన సౌందర్యంతో పాటు లోతైన భావజాలం కలబోసిన కళామూర్తిగా ఆమె వెలిగారు. బి. సరోజాదేవి మరణంతో దక్షిణ భారతీయ సినిమా రంగం ఒక వెలుగు కోల్పోయింది. కానీ ఆమె నటించిన వందలాది చిత్రాలు, అందులో ఆమె పోషించిన పాత్రలు, ఆమె పలికిన సంభాషణలు, ఆమె చూపిన హావభావాలు – ఇవన్నీ ఈ తరం నుంచీ రాబోయే తరాల వరకు కళా. మీమాంసకులకూ, అభిమానులకూ స్ఫూర్తిగా నిలవనున్నాయి.

  • రామకిష్టయ్య సంగనభట్ల, 94405 95494
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News