Wednesday, July 16, 2025

అల్బనీస్‌పై ఆంక్షలు అహంకారపూరితం

- Advertisement -
- Advertisement -

పాలస్తీనా భూభాగాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను దర్యాప్తు చేయడానికి ఐక్యరాజ్యసమితి నియమించిన ప్రత్యేక రిపోర్టర్, స్వతంత్ర నిపుణురాలు ఫ్రాన్సెస్కా అల్బనీస్‌పై అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం. యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రాజకీయ, ఆర్థిక యుద్ధప్రచారం నిర్వహిస్తున్నారన్న నెపంతో ఆమెపై ఆంక్షలు విధించడం ఏ రకంగానూ సమంజసం కాదు. ప్రజాస్వామ్యం గురించి అనునిత్యం నీతులు వల్లించే అమెరికా సాక్ష్యాత్తు ఐక్యరాజ్యసమితి స్వతంత్ర నిపుణురాలిపై ఈ రకంగా ఆంక్షలు విధించి విషమ పరిస్థితులకు గురిచేయడం కడు గర్హనీయం. ఒక రకంగా అంతర్జాతీయ సంస్థల ఉద్దేశాలను, లక్ష్యాలను అమెరికా ధ్వంసంచేస్తూ అప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తూనే ఉంది అని చెప్పవచ్చు.

ఐక్యరాజ్యసమితి కౌన్సిల్‌లోని దేశాలు ఆయుధ నిషేధం విధించాలని, ఇజ్రాయెల్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని ఫ్రాన్సెస్కా అల్బనీస్ పిలుపునిచ్చారు. గాజా లో ఇజ్రాయెల్ ప్రవర్తనను జాతి నిర్మూలన చర్యలు, అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనలుగా (Violations international law) ఆమె అభివర్ణించారు. వృత్తి ఆర్థిక వ్యవస్థ నుండి జాతి విధ్వంసం వరకు అంటూ ఫ్రాన్సెస్కా అల్బనీస్ నివేదికను ప్రచురించారు. ‘ఆయుధ తయారీదారుల నుండి ఆర్థిక సంస్థల వరకు 48 మంది కార్పొరేట్ వ్యక్తులను ఇజ్రాయెల్ ప్రభుత్వంతో వారి సహకారం ఆధారంగా లాభాన్ని ఆర్జించారు’ అని ఆమె నివేదికలో ఆరోపించారు. దీనిని సహించని అమెరికా అన్యాయంగా ఆమెపై ఆంక్షలు విధించి తన దమననీతిని బట్టబయలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది.

ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో ఫ్రాన్సెస్కా అల్బనీస్‌ని పదవినుండి తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా ఒత్తిడి ప్రచారం చిట్టచివరికి విఫలమైన తర్వాత ఈ రకమైన ఆంక్షలు ముందుకువచ్చాయ ని సృష్టంగా అర్థమవుతుంది. ఆమెపై ఇలా అన్యాయంగా ఆంక్షలు విధించడం అంతర్జాతీయ మానవ హక్కుల వ్యవస్థను మరింతగా బలహీనపరుస్తుంది. స్పెషల్ రిపోర్టర్లపై ఈ రకమైన ఏకపక్ష ఆంక్షలను అమెరికా విధించడం ఏమాత్రం సమంజసం కాదు. ఫ్రాన్సెస్కా అల్బనీస్ ఇప్పుడు ఆస్తుల ఫ్రీజింగ్, ప్రయాణ ఆంక్షలను ఎదుర్కొనడం బాధాకరం. ‘ఈ ఆంక్షలు నన్ను తిరగకుండా నిరోధించవచ్చు. సాధారణంగా నాతో నిమగ్నమయ్యే వ్యక్తులపై ఈ ఆంక్షలు ప్రభావాన్ని చూపిస్తాయి.

అమెరికా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల పరిరక్షకులకు ప్రమాదకరమైన సంకేతంగా నిలిచింది’ అని ఫ్రాన్సెస్కా అల్బనీస్ పేర్కొనడాన్ని ప్రత్యేకంగా గమనించవచ్చు. అమెరికా తనపై ఆంక్షలు విధించడాన్ని ఫ్రాన్సెస్కా అల్బనీస్ ఖండించి ఈ ఆంక్షల చర్యను ‘అపరాధ భావన’గా అభివర్ణించారు. ‘శక్తివంతులు శక్తి లేని వారి కోసం మాట్లాడే వారిని శిక్షించడం బలానికి సంకేతం కాదు. అది అపరాధానికి సంకేతం. తనపై అమెరికా విధించిన ఆంక్షలను మాఫియా తరహా బెదిరింపులను తలపిస్తున్నాయి. విమర్శకులను శిక్షించే ప్రయత్నంలో భాగంగానే అమెరికా ఈ తరహా ఆంక్షలు విధిస్తూనే ఉంది అని అవగతం అవుతుంది. ప్రపంచ సమస్యలపై నివేదించడానికి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నియమించిన నిపుణులలో ఫ్రాన్సెస్కా అల్బనీస్ ఒకరుగా ఉన్నారు.

మానవ హక్కుల మండలి ప్రత్యేక విధానాలు అని పిలువబడే దాని కింద ప్రత్యేక రిపోర్టర్లను నియమిస్తారు. కౌన్సిల్ ఆదేశాన్ని నెరవేర్చడంలో స్పెషల్ రిపోర్టర్లు ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు.వారు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సమస్యలను పర్యవేక్షించడానికి, నివేదించడానికి నియమించబడిన స్వతంత్ర నిపుణులుగా కొనసాగుతారు. వారు జెనీవాలోని కౌన్సిల్‌కు, అలాగే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి క్రమం తప్పకుండా నివేదిస్తారు. ఈ నిపుణులు వారి వ్యక్తిగత హోదాలో పనిచేస్తారు. ఫ్రాన్సెస్కా అల్బనీస్ ఒక అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది. ఆమె జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్‌లో అనుబంధ స్కాలర్, మధ్యప్రాచ్యంలో నిపుణురాలు. ఆమె ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక నిపుణురాలుగా కొనసాగుతున్నారు.

2023 అక్టోబర్‌లో గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఆమె ఇజ్రాయెల్ యుద్ధ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాంతికోసం కృషి చేస్తూనే ఉన్నారు. గాజా ప్రాంతంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ నిరాటకంగా కొనసాగిస్తున్న యుద్ధాన్ని ‘జాతిహత్య’గా ఫ్రాన్సెస్కా అల్బనీస్ అభివర్ణించారు. ఇజ్రాయెల్ నిరాటకంగా కొనసాగిస్తున్న యుద్ధోన్మాదాన్ని ‘ఆధునిక చరిత్రలో అత్యంత క్రూరమైన మారణహోమాలలో ఒకటి’ అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిని ఉద్దేశించి ఆమె పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయ సంస్థలు నియమించిన వ్యక్తులపై దాడులు, ఆంక్షలు, బెదిరింపులను నియంత్రించాల్సిన అవసరం తప్పకుండా ఉంది.

శాంతి కోసం కృషి చేస్తున్న ఫ్రాన్సెస్కా అల్బనీస్‌పై ఆంక్షలు విధించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. ఆంక్షలు ప్రమాదకరమైన ప్రమాణాలను నెలకొల్పుతాయని ఐక్యరాజ్య సమితి నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రత్యేక రిపోర్టర్, స్వతంత్ర నిపుణురాలు ఫ్రాన్సిస్కా అల్బనీస్‌పై అమెరికా ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిసహా అనేక సంస్థలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అంతిమంగా ఫ్రాన్సిస్కా అల్బనీస్‌పై తక్షణమే ఆంక్షలను ఎత్తివేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ దిశగా ప్రగతిశీల ప్రజాస్వామ్యశక్తులు ఉద్యమించాల్సిన అవసరం తప్పకుండా ఉంది.

  • జె.జె. సి.పి. బాబూరావు, 94933 19690
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News