అమరావతి: కరవుతో వచ్చే దుర్భిక్ష పరిస్థితులను పారద్రోలాలంటే నదుల అనుసంధానమే మార్గం అని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తెలిపారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కె.ఎల్. రావు 124వ జయంతి కార్యక్రమం జరిగింది. దుర్గా ఘాట్ లోని కె.ఎల్. రావు ఘాట్ వద్ద నిమ్మల నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ..50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానానికి కె.ఎల్ రావు నాంది పలికారని అన్నారు. కెఎల్ రావు స్ఫూర్తిని ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని తెలియజేశారు. ప్రఖ్యాత ఇంజనీర్ కె.ఎల్.రావు తెలుగువారు కావడం గర్వకారణం అని నిమ్మల ప్రశంసించారు.
2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యం అని చెప్పారు. పట్టిసీమ కాదు వట్టిసీమ అని గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవహేళన చేశారని మండిపడ్డారు. చంద్రబాబు కృషితో పట్టిసీమ పూర్తి వల్ల కృష్ణా డెల్టా సస్యశ్యామలం అవుతోందని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై (irrigation projects) తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తారు. ఈ ఏడాదిలో ఉత్తరాంధ్రకు పోలవరం ద్వారా నీరు తేవడమే లక్ష్యం అని స్ఫూర్తినిచ్చేలా పనిచేయడమే కెఎల్ రావుకు ఇచ్చే ఘనమైన నివాళి అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.