రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతోనే ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు, విద్యార్థుల మరణాలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సర కాలంలో వెయ్యికి పైగా ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు నమోదై, వేల మంది విద్యార్థులు అనారోగ్యానికి గురై, 100 మందికి పైగా విద్యార్థులు మరణించడానికి రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఇన్ని విషాద సంఘటనలు జరిగిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఒక సమీక్ష కూడా చేయకపోవడం ఆయన నియంతృత్వ అమానవీయ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఒకటి, రెండుసార్లు జరిగితే పొరపాటు అనుకోవచ్చని..కానీ, వెయ్యి సంఘటనలు వరుసగా జరిగి విద్యార్థులు పిట్టల్లా రాలుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని అన్నారు.
తన పిల్లలు ఉంటే సిఎం చూస్తూ ఊరుకుంటారా..?
ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రిగా కాకుండా కనీసం ఒక తండ్రిగా అయినా రేవంత్ రెడ్డి ఆలోచించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. తన పిల్లలకు ఆహారం బదులు రాష్ట్ర ప్రభుత్వమే విషం పెడితే రేవంత్ రెడ్డి ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు. ఇలాంటి దుర్భర, దారుణ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పిల్లలు ఉంటే ఆయన ఇలాగే చూసీచూడనట్లు ఉంటారో లేదంటే చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా దృష్టి పెట్టాలని ఇద్దరు పిల్లల తండ్రిగా విజ్ఞప్తి చేస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి గతంలో అన్నట్లు విద్యార్థుల మరణాలకు ఎవర్ని బాధ్యులు చేస్తారు.. ఎవరెవరినీ ఉరితీస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గురుకుల విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్, మరణాల అంశాన్ని గతంలో తమ పార్టీ తరపున ప్రభుత్వ దృష్టికి అనేకసార్లు తీసుకువచ్చామని చెప్పారు. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రతిసారి రాష్ట్ర మంత్రులు కంటి తుడుపు చర్యలతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఫుడ్ పాయిజనింగ్‌తో విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం మాత్రం దాన్ని రాజకీయం చేసి సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వదిలి గురుకుల హాస్టల్స్‌లో జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్టవేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిఆర్‌ఎస్ తరపున తమ పోరాటం కొనసాగిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు.