మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్‌గిరి ఎంపి ఈటెల రాజేందర్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఇద్దరిపై నమోదయిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. కెసిఆర్‌పై 2023లో అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టి వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం ఆయనపై నమోదయిన కేసులను కొట్టివేసింది. ఇప్పటికే 2021 నవంబర్ 15వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అనుమతి లేకుండా భారీ వాహనాలతో ర్యాలీ నిర్వహించారని ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉండగా, ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. తాజాగా మరోక కేసు కొట్టివేయడంతో ఆయనకు భారీ ఊరట లభించినట్లయింది. కాగా, మల్కాజ్‌గిరి ఎంపి ఈటెల రాజేందర్ కమలాపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో అనుమతి లేకుండా బాణాసంచా కాల్చారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ ఈటెల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఆయనపై నమోదయిన కేసును కొట్టివేసింది.