మెదక్ జిల్లా ఎస్‌సిసెల్ కార్యదర్శి అనిల్‌పై కాల్పులు
కొల్చారం సమీపంలోని వరిగుంతం వద్ద దారికాచి దాడి చేసిన దుండగులు
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : అధికార కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరెల్లి అనిల్‌కుమార్ (29) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే…సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొల్చారం పరిధిలో గల వరిగుంతం గ్రామ శివారులోని సబ్‌స్టేషన్ వద్ద కాపుకాసి అనిల్‌కుమార్‌ను హతమార్చారు. ముందుగా రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా నాలుగు బుల్లెట్లను గుర్తించారు. సంఘటన స్థలం నుంచి అనిల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుని స్వస్థలం కొల్చారం మండల పరిధిలోని పైతర గ్రామం. సోమవారం పార్టీ పనులపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇంటికి వెళ్లే మార్గంలో వరిగుంతం సబ్‌స్టేషన్ స మీపంలో హత్యకు గురయ్యాడు. ఘటన స్థలం లో తుపాకీ గుండ్లు లభ్యం కావడంతో జిల్లా పోలీసులు లోతైన దర్యాప్తును ప్రారంభించి అనిల్ హ త్యకు గురయ్యాడని నిర్ధారణకు వచ్చారు. మృతు డు అనిల్‌కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాలోని ఒక ఎంఎల్‌ఎతో భూ వివాదాలు ఉ న్నాయి. అందులో దాదాపు రూ.80 లక్షలతో పాటు బెంజి కారును కూడా ఎంఎల్‌ఎ వద్ద నుం చి తెచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా మృతుడికి హైదరాబాద్‌లోని పలు రియల్టర్లతో భూ వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో నానక్‌రామ్‌గూడకు చెందిన ఆరు గుంటల భూమిలో సమస్య తీవ్రతరంగా ఉన్నట్లు మృతుని బంధువులు వెల్లడించారు. జిల్లాలోనే సంచలనం రేపిన ఈ హత్య కేసును పోలీసులు సవాల్‌గా తీసుకొని నిందితుల కోసం పలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ హత్యను సుపారీ హత్యగా భావించి ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నామని జిల్లా ఎస్‌పి డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్‌రెడ్డి సందర్శించి అనిల్ హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమితం తరలించడంతోపాటు ఫోరెన్సిక్ నిపుణులను కూడా రప్పించి హత్యకు గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వైద్యుల నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా, ఈ హత్యను దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దళితులపై జరుగుతున్న దుర్ఘటనలపై పోలీసులు పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని, అనిల్ హంతకులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.