తూర్పు ఇరాక్‌లో కొత్తగా తెరిచిన షాపింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, పిల్లలు సహా 60కిపైగా జనులు ప్రాణాలు కోల్పోయారని ఇరాఖీ అధికారులు గురువారం తెలిపారు. మంటల్లో చిక్కుకుపోయిన 45 మందికిపైగా జనులను సివిల్ డిఫెన్స్ బృందాలు రక్షించాయని సమాచారం. సామాజిక మాధ్యమంలో వచ్చిన దృశ్యాలు షాపింగ్ సెంటర్‌లో చాలా భాగం మంటల్లో చిక్కుకున్నట్లు కనిపించింది. వారం క్రితం మాత్రమే తెరిచిన ఐదు అంతస్తుల షాఫింగ్ సెంటర్ అయిన కార్నిచ్ హైపర్ మార్కెట్ మాల్ పూర్తిగా మంటల్లో చిక్కుకున్నట్లు స్థానిక మీడియాలో ఫోటోలు, వీడియోలు వచ్చాయి. షాపింగ్ సెంటర్ అగ్నిప్రమాదంలో 61 మంది మరణించారని,
వారిలో ఎక్కువ మంది ఊపిరాడక మరణించారని ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. చనిపోయిన వారిలో 14 కాలిపోయిన మృతదేహాలు ఉన్నాయని, వాటిని ఇంకా గుర్తించలేదని తెలిపింది. ఇదిలావుండగా మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించినట్లు ప్రాంతీయ గవర్నర్ ముహమ్మద్ అల్-మయ్యోహ్ ఓ ప్రకటనలో తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణం దర్యాప్తులో ఉందని, భవన యజమాని, షాపింగ్ సెంటర్ యజమానిపై చట్టపరమైన కేసులు నమోదుచేశామని కూడా ఆయన తెలిపారు. అయితే ఆరోపణలు ఏమిటన్నది మాత్రం ఆయన వివరించలేదు.