Friday, July 18, 2025

జనం దృష్టి మళ్లించడానికే కెటిఆర్‌పై ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:బనకచర్ల పైన నగ్నంగా దొరికిపోయిన సిఎం రేవంత్‌రెడ్డి, విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు ఎజెండాలో ఉన్నదని ఎపి మంత్రి చెబితే, రేవంత్ రెడ్డి ఏమో బనకచర్ల అసలు చర్చకు రాలేదని అం టున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి చీకటి బాగోతం కప్పిపుచ్చుకునేందుకు బజారులోని చెత్త అంతా మీడియా ముందు ఉంచారని అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం హరీష్‌రావు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మా ట్లాడారు. ఈ సందర్భంగా కెటిఆర్‌పై సిఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.కెటిఆర్ సవాల్ విసిరితే చర్చకు రాని రేవంత్‌రెడ్డి డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళుకు బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి లాగా కెటిఆర్ బ్యాగులు మొయ్యలేదని, ఆయన విదేశాలలో ఉన్నత చదువుకుని తెలంగాణ ప్రతిష్టను జాతీయ, అంతర్జాతీయ వేదికలలో నిలబెట్టారని తెలిపారు. కానీ రేవంత్‌రెడ్డి కెటిఆర్‌ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎవరో దుబాయిలో చనిపోతే తమకేం సంబంధం..? అని ప్రశ్నించారు. సిఎం చుట్టూ ఉన్నవారు బ్యాగులు మోసేవారని, పరిపాలన అంటే బ్యాగులు మోసుడు కాదు అని పేర్కొన్నారు. సిఎం రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో లేదా కమాండ్ కంట్రోల్ బిల్డింగ్‌లోనే పాలన చేస్తున్నావని విమర్శించారు. రోజూ ప్రజలను కలుస్తా అని చెప్పిన రేవంత్‌రెడ్డి సచివాలయానికి ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి బానిస మనస్తత్వం పోవడంలేదని హరీష్‌రావు విమర్శించారు. చంద్రబాబుకు కోపం వస్తుందని రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనడం లేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని, ముఖ్యమంత్రి అయిన తరువాత జై తెలంగాణ అంటాడేమో అనుకున్నామని అన్నారు. కర్ణాటక సిఎం జై కర్ణాటక, మహారాష్ట్ర సిఎం జై మహారాష్ట్ర అని అంటున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ జై హింద్ అంటున్నారని చెప్పారు. తెలంగాణకు వచ్చినప్పుడు మల్లికార్జున్ ఖర్గే కూడా జై తెలంగాణ అన్నారని, కానీ రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు.

ఏం చేసినా కెసిఆర్‌కు ఉన్న ఇమేజ్ రేవంత్ రెడ్డికి రాదు
సిఎం రేవంత్‌రెడ్డి లైయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధ పడుతున్నారని హరీష్‌రావు విమర్శించారు. ఢిల్లీ పర్యటనకి సంబంధించి ఒక రోజు ముందు ఎపికి షాక్ అని లీక్‌లు ఇచ్చి, మధ్యాహ్నం కల్లా బనకచర్ల ప్రాజెక్టు ఎజెండాలో ఉంటే పోయేది లేదు అని చెప్పి, రాత్రి కల్లా పరుగు పరుగున ఢిల్లీకి పోయారని తెలిపారు. నీటి ఒప్పందాల గురించి సిఎం రేవంత్ రెడ్డికి తెలియదని విమర్శించారు. నీటి వినియోగానికి, నీటి పంపకానికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలని హితవు పలికారు. ఏం చేసినా కెసిఆర్‌కు ఉన్న ఇమేజ్ రేవంత్ రెడ్డికి రాదు అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తన ఎత్తు గురించి మాట్లాడతారని, కానీ ఆయన ఏం చేసినా తన అంత ఎత్తు పెరగడని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే అసెంబ్లీ పెట్టి తమ మైక్ కట్ చెయ్యకుండా నిజాయితీగా అన్ని అంశాలపైన చర్చించేందుకు బిఆర్‌ఎస్ సిద్ధం అంటూ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటున్నారని ఆరోపించారు. కెటిఆర్‌పైన చేసిన ఆరోపణల్లో రుజువు ఉంటే చూపించాలని, లేదంటే కెటిఆర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేశ్‌కు కెటిఆర్ అర్ధరాత్రి పూట కలిశాడు అని రేవంత్ రెడ్డి అంటున్నారు.. ఈ రాష్ట్రంలో అర్ధరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్ రెడ్డికే ఉందని విమర్శించారు. తమ చుట్టూ సిఎం నిఘా పెట్టారని, బిఆర్‌ఎస్ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. తమ వెనుక ఇంటెలిజెన్స్ వాళ్ళను పెట్టి ఎక్కడ అంటే అక్కడ తిప్పుతున్నారని తెలిపారు. తాత్కాలిక నీటి ఒప్పందంలో భాగంగా కృష్ణా జలాల్లో ట్రిబ్యునల్ సెక్షన్ 3 సాధించారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News