దక్షిణ ఆఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక పోరాటయోధుడు, న్యాయవాది, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఎఎన్‌సి) నాయకుడు, దానశీలి, ప్రజాసేవకుడు, ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వంలో తొలి నల్లజాతి దేశాధ్యక్షుడు (1994 -99), 27 ఏండ్లపాటు జైలు జీవితం అనుభవించిన అవిశ్రాంత నల్లజాతి ప్రతినిధి అయిన నెల్సన్ మండేలా పుట్టిన రోజు సందర్భంగా ఐరాస చొరవతో ప్రతి ఏట 18 జులై రోజున అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ నెల్సన్ మండేలాను పాటించడం 18 జులై 2010 నుంచి ప్రారంభమైంది. దక్షిణ ఆఫ్రికాలోని మ్వోజో గ్రామంలోని తెంబూ రాయల్ కుటుంబంలో జన్మించిన మండేలా వంశంలో తొలి విద్యావేత్తగా పోర్ట్‌హేర్, విట్‌వాటర్స్రాడ్ యూనివర్శిటీల్లో బిఎ, న్యాయ పట్టాలు పొంది ఉన్నత విద్యావేత్తగా పేరు తెచ్చుకొని, లాయర్‌లా పని చేశారు.
పాఠశాల ఉపాధ్యాయుడు తన పేరు ముందు నెల్సన్‌ను చేర్చడంతో నెల్సన్ మండేలా అనే పేరు ఖ్యాతిలోకి వచ్చింది.1943లో వర్ణవివక్ష వ్యతిరేక పోరాటాలు (Anti-apartheid struggles) ప్రారంభించిన మండేలా ఎఎన్‌సి పార్టీలో చేరి శ్వేతజాతి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించారు. వర్ణవివక్ష పోరాటంలో చురుకుగా పాల్గొనడంతో అరెస్టు అయ్యారు. ఇదే క్రమంలో మార్క్సిజం వైపు ఆకర్షితులై దక్షిణ ఆఫ్రికా కమ్యూనిస్టు పార్టీలో చేరి రహస్యంగా ఉద్యమాలు చేశారు. శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉమ్కోంటో వీ స్విజ్వే అనే తీవ్రవాద సంస్థను స్థాపించారు. నాటి శ్వేత జాతి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ, 12 జూన్ 1963 రోజున యావజ్జీవ కారాగార శిక్షను విధించడంతో 27 ఏండ్లపాటు సుదీర్ఘ జైలు జీవితం అనుభవిస్తూ అంతర్జాతీయ మానవాళి దృష్టిని ఆకర్షించారు. జాతీయ, అంతర్జాతీయ ఒత్తిడులకు లొంగిన నాటి ప్రభుత్వం 11 ఫిబ్రవరి, 1990న విడుదల చేసింది. జైలులో 466 గదిలో బంధించబడి 63 (1963)లో విడుదల కావడంతో 46663ని మండేలా సంఖ్యగా పిలవబడం జరుగుతోంది.
విడుదల అనంతరం నాటి శ్వేతజాతి ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా 1994లో నిర్వహించిన ఎన్నికల్లో ఎఎన్‌సి పార్టీ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో నల్లజాతికి చెందిన తొలి అధ్యక్షుడిగా సేవలు అందించారు. వర్ణవివక్షను రూపుమాపే కొత్త రాజ్యాంగాన్ని రూపొందించారు. భూసంస్కరణలు, పేదరిక నిర్మూలన, స్వపరిపాలనలకు పట్టం కట్టిన మండేలా నల్లజాతి ఉద్ధారకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. 1998-99 మధ్య అలీనోద్యమం సెక్రెటరీ జనరల్‌గా విశిష్ట సేవలు అందించారు. రెండవ దఫా అధ్యక్షుడిగా సేవలు అందించడాన్ని ఇష్టపడకుండా తన పేరున ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన, హెచ్‌ఐవి-, ఏయిడ్స్ వ్యతిరేక పోరాటాలు చేశారు. అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం సందర్భంగా పేదరిక నిర్మూలన కేంద్రంగా అన్నదాన కార్యక్రమాలు, వృద్ధుల పట్ల ఆదరణ, యువతకు ప్రేరణాత్మక కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవలు, పరిసరాల పరిశుభ్రత లాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు.
వర్ణసమానత్వం, స్వేచ్ఛాయుత పౌరసమాజం, సమానావకాశాల కల్పన, సుహృద్భావ వాతావరణం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అందరికీ అందుబాటులో విద్య లాంటి కనీస అంశాలకు అంకితభావంతో సేవలు అందించిన నల్లజాతి వెలుగుల సూరీడు మండేలా నేటి యువతకు నిత్యప్రేరణగా నిలుస్తూ, భవిష్యత్తుకు దారులు చూపే దారి దీపం అవుతున్నారు. ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడం అనబడే పేరుతో ఆత్మకథను రాసిన మండేలాను దక్షిణ ఆఫ్రికా గాంధీగా పిలవడం సముచితంగా వుంది. సామాజిక న్యాయమే ఊపిరిగా జీవించిన ప్రజాస్వామ్య జ్యోతి మండేలాను భారత రత్న, నోబెల్ శాంతి బహుమతి, దక్షిణాఫ్రికా జాతి పిత, జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య పురస్కారం లాంటి 250కి పైగా పురస్కారాలు ఆయన్ని వరించి మురిసిపోయాయి. ప్రతిష్ఠాత్మక ‘మడిబా’ అనే బిరుదును పొందిన మండేలా 05 డిసెంబర్ 2013న తుది శ్వాస విడిచారు.
- డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, 99497 00037
- నేడు అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం