ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్ జట్టు కొనుగోలు చేయడంతో వెలుగులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. లీగ్‌లో అదరగొట్టాడు. గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ప్రస్తుతం వైభవ్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ సందర్భంగా అక్కడ పలు రికార్డులను అతడు సాధిస్తున్నాడు. ఐదు యూత్ వన్డేల్లో ఆరంభంలో నిరాశపరిచినా.. నాలుగో వన్డేలో 52 బంతుల్లో సెంచరీ చేసి అదరహో అనిపించాడు.
ఇప్పుడు యూత్ టెస్ట్ సిరీస్‌లోనూ వైభవ్ (Vaibhav Suryavanshi) అదరగొడుతున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఈ చిచ్చరపిడుగు చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో విఫలమైనప్పటికీ.. బౌలింగ్‌లో కుమ్మేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హంజా షేక్(84), వికెట్ కీపర్ థామస్ రూ (34) వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 44 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, 1 సిక్సుతో 56 పరుగులు చేశాడు. దీంతో అత్యంత పిన్న వయస్సులో ఒక యూత్ టెస్ట్‌లో అర్థశతకంతో పాటు వికెట్ తీసిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు బంగ్లాదేశీ క్రికెటర్ హసన్ మిరాజ్ పేరిట ఉండేది. హసన్ 15 ఏళ్ల 167 రోజుల వయస్సులో ఈ రికార్డు సాధించగా.. వైభవ్ 14 ఏళ్ల 107 రోజుల్లో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి యూత్ టెస్ట్ డ్రాగా ముగిసింది.