Friday, July 18, 2025

ఆయన పొంగులేటి కాదు.. బాంబులేటి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎప్పటికీ కెసిఆర్ స్థాయి రాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ప్రయోజనం లేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఖమ్మం పర్యటనలో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తాను తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నామని వివరించారు. సవాల్‌ విసిరిన రేవంత్‌ చివరకు తోక ముడిచారని చురకలంటించారు. అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు చర్చిద్దామంటున్నారని, కానీ తన మైక్ కట్ చేయకుండా ఉంటే చర్చకు సిద్ధంంగా ఉన్నానని సవాల్ విసిరారు. సిఎం రేవంత్‌ను మానసిక హాస్పిటల్‌లో చూపించాలని ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా డ్రగ్స్, హీరోయిన్స్ అంటూ అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

ఇంకెంతకాలం ఆరోపణలు చేస్తారని, హామీల సంగతేంటని ప్రశ్నించారు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే తనకేం సంబంధమని,  దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు. ఎపి మంత్రి లోకేష్‌ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం తనకు లేదని,  తాను లోకేష్‌ను కలవలేదని, కలిసినా తప్పేంటి? అని అడిగారు. బనకచర్లపై చర్చించామని ఎపి మంత్రి నిమ్మల అన్నారని, బనకచర్లపై చర్చించలేదని రేవంత్ చెప్పారని, ఎవరు అబద్ధం చెప్పారని నిలదీశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్  రహస్య ఒప్పందం బయటపడిందని, దీంతో రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణను అనేక అంశాల్లో నెం.1గా నిలిపామని ప్రశంసించారు.

ఖమ్మంలో ముగ్గురు మొనగాళ్లులాగా తిరుగుతున్నారని,  బాంబులు పేలుతాయని పొంగులేటి చెప్పారని, గత దీపావళి పోయింది మళ్ళీ దీపావళి వస్తుందని, ఇప్పటివరకు ఒక్క బాంబు పేలలేదని ఎద్దేవా చేశారు. ఆయన పొంగులేటి కాదు, బాంబులేటి అని పిలుస్తున్నారని చురకలంటించారు. కమిషన్లలో ఒకాయన బిజీగా ఉన్నారని, రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని, రైతన్నలకు ఎరువులు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కెటిఆర్ విమర్శలు గుప్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసి బీఆర్ఎస్ సత్తా చాటాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా మా కోసం కార్యకర్తలు, నాయకులు కష్టపడ్డారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము కష్టపడి ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ లుగా గెలిపించుకుంటామన్నారు. ప్రభుత్వం మీద ప్రజలకు పీకల దాకా ప్రజలకు కోపం ఉందని, ఈ వ్యతిరేకతను సరిగ్గా వాడుకుంటే ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పరిషత్తులు బిఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. యువకులు ముందుకొచ్చి కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించగలిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని కెటిఆర్ తెలియజేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News