‘దసరా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న నటుడు దీక్షిత్ శెట్టి. ప్రస్తుతం అతను రష్మికతో కలిసి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నదివే’ (Nadive Song) అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట, ముఖ్యంగా పాటలో రష్మిక, దీక్షిత్ చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొంత సమయంలోనే ఈ పాట వైరల్ అయింది. అయితే ఈ పాట సమయంలో తమకు ఎదురైన అనుభవాలను దీక్షిత్ పంచుకున్నాడు.
తాను సినిమా కోసం డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి అని తెలిపాడు. కొరియోగ్రాఫర్ విశ్వకిరణ్‌తో కలిసి ఈ పాట (Nadive Song) కోసం వారం పాటు రీసెర్చ్ చేశామని అన్నాడు. ‘‘శరీరాన్ని నియంత్రించుకుంటూ సౌండ్‌కు తగ్గట్టు డ్యాన్స్ చేయడం కష్టం. లైవ్ షోలో ఇలాంటి పెర్ఫామెన్స్ చేసేప్పుడు తప్పులు జరిగినా ఫర్వాలేదు. కానీ, సినిమా విషయంలో అలా ఉండదు. అందుకే ఫర్‌ఫెక్ట్‌గా చేయడం ముఖ్యం. ప్రాక్టీస్ సమయంలో నాకు, రష్మికకు గాయాలయ్యాయి. కొత్తది నేర్చుకునేందుకు ఇదో మంచి అవకాశమని భావించి ముందుకెళ్లా. ఈ పాటకు మంచి స్పందన లభించడం సంతోషం కలిగించింది’’ అని దీక్షిత్ పేర్కొన్నాడు.