రెండు రాష్ట్రాలు వివాదరహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలి
కేంద్ర జలశక్తి శాఖ సమావేశాన్ని స్వాగతిస్తున్నా
బనకచర్లపై తొలుత మాట్లాడింది నేనే
టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా మారినప్పుడే తెలంగాణ సెంటిమెంట్ పోయింది : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి అన్యాయం చేయడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కితాబిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రజలచేత ఎన్నుకోబడిన నేత అని అన్నారు. ఆయన నామినేట్ చేయబడిన వ్యక్తి కాదని నారాయణ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాక ఇరు రాష్ట్రల సీఎంలతో సమావేశం నిర్వహించడంపై నారాయణ శుక్రవారం స్పందించారు. ఈ సమావేశాన్ని తాను స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదని అన్నారు. నీళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం, తల్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం వంటిదేనని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్లుగా పంచాయితీ కొనసాగుతూనే ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తానే తొలిసారి స్పందించానని అన్నారు.
ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు కొంచెం అతిగా మాట్లాడారని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే బనకచర్లను తెరపైకి తెచ్చారని నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. బనకచర్ల ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు కాదని పేర్కొన్న నారాయణ ఇది రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు కాదని, దాదాపుగా రూ.2 లక్షల కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు వివాద రహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో ప్రతి అంశంపై ప్రధాన ప్రతిపక్షం సెంటిమెంట్లతో రెచ్చగొడుతోందని విమర్శించారు. టిఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ అనేది ఎగిరిపోయిందని అన్నారు.