Sunday, July 20, 2025

50% మించి రిజర్వేషన్ అమలు సాధ్యమా?

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న నిర్ణయం రాజకీయ, సామాజిక, చట్టపరమైన చర్చలకు దారితీసింది. ఈ నిర్ణయం కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజ్యాంగ సవరణలు, న్యాయసమీక్షలు, కులగణన ద్వారా సేకరించిన గణాంకాలతో ముడిపడి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించిన రిజర్వేషన్లను కలుపుకుని మొత్తం 50 శాతానికి పరిమితం చేసే తీర్పులు ఉన్నందున ఏదైనా రాష్ట్రం పరిమితికి మించి రిజర్వేషన్లు అమలు చేసే ప్రయత్నం చేసినపుడు అవి న్యాయ సమీక్షకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిమితిని అధిగమించేందుకు ఒక ఆర్డినెన్స్‌ను ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదిస్తే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు జరుగుతాయి.

ప్రభుత్వం తరుపున కేవియట్ పిటిషన్ వేసినా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ ఆశావహ అభ్యర్థులు ఈ నిర్ణయంపై హైకోర్టు లేదా సుప్రీం కోర్టుకు వెళ్ళినపుడు న్యాయ సమీక్షకు గురయ్యే అవకాశం లేకపోలేదు. రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చడం (Inclusion 9th Schedule) ద్వారా మాత్రమే ఈ రిజర్వేషన్‌కు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. 2024లో నిర్వహించిన కులగణన ఈ రిజర్వేషన్ పెంపులో కీలకపాత్ర పోషించనుంది. ఈ గణన ప్రకారం, తెలంగాణ జనాభా 3.70 కోట్లుగా, బిసిలు 56.33 శాతంగా నమోదైంది. ఇందులో బిసి ముస్లింలు 10.08 శాతం, బిసి హిందువులు 46.25 శాతం ఉన్నారు. ఎస్‌సి కేటగిరి 17.43.శాతం, ఎస్‌టి కేటగిరి 10.45 శాతం , ఓపెన్ కేటగిరీ (ఒసి) 15.79 శాతం, ఒసి ముస్లింలు 2.48 శాతం ఉన్నారు. మొత్తం ముస్లిం జనాభా 12.56 శాతం ఉన్నారు.

ఈ సర్వేలో 3.54 కోట్ల మంది పాల్గొన్నారని, మరో 16 లక్షల మంది సర్వేకు దూరంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సర్వేలో పాల్గొనని వారిలో ఏ సామాజిక వర్గ జనాభా ఎంత ఉందో తెలుసుకునే వీలు లేకుండాపోయింది. ఈ గణాంకాలపై వివిధ కులసంఘాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కెసిఆర్ హయాంలో 2014 లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ముస్లింలను బిసిల్లో కలిపి లెక్కించారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. 2001 2011 దశాబ్ద వృద్ధి రేటును, రాష్ట్రంలో ఉన్న ఆధార్ కార్డులు, ఓటర్ కార్డుల్ని పరిగణనలోకి తీసుకున్నా రాష్ట్ర జనాభా నాలుగు కోట్లకు పైగా ఉంటుందన్నది వారి వాదన. 2011 జనగణన ప్రకారం తెలంగాణ జనాభా 3.50 కోట్లు, 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3.63 కోట్లుగా ఉంది, అంటే దాదాపు మూడున్నర ఏండ్లలో 13 లక్షల వరకు జనాభా పెరిగింది. కానీ, 2024 రాష్ట్ర జనాభా 3.70 కోట్లుగా తెలిపారు. 2014 నుంచి 2024 వరకు పదేళ్లలో కేవలం 7 లక్షల జనాభా పెరిగినట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోంది.

ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశం ఒకవేళ న్యాయ సమీక్షకు వెళ్తే న్యాయస్థానాల్లో ఈ డేటా సమర్పించినప్పుడు, దీని విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తే అవకాశం లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘కామారెడ్డి డిక్లరేషన్’ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ అసెంబ్లీ బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచే బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు 50 శాతం పరిమితిని మించడం వల్ల, కేంద్ర ప్రభుత్వ ఆమోదం, రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చడం అనివార్యంగా మారింది. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ అమలుచేస్తే న్యాయస్థానాల్లో నిలదొక్కుకోవడం కష్టమని ప్రతిపక్ష పార్టీలతోపాటు పలు కులసంఘాల నేతలు అధికార కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు 1992 ఇంద్రా సాహ్నీ కేసులో రిజర్వేషన్‌ను 50 శాతంగా పరిమితం చేసింది.

అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఈ పరిమితిని మించవచ్చని, దీనికి శాస్త్రీయమైన గణాంకాలు అవసరమని తీర్పును ఇచ్చింది. 2010 కె. కృష్ణమూర్తి కేసులో బిసి రిజర్వేషన్‌ల కోసం ట్రిపుల్ టెస్ట్ నియమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఆయా సామాజిక వర్గాల వెనుకబాటు అధ్యయనం, శాస్త్రీయమైన డేటా, 50 శాతం పరిమితి పాటించడం మొదలైనవి ఉన్నాయి. 2021 వికాస్ రావు గవాలి కేసులో కూడా ఈ నియమాన్ని మరోసారి పునరుద్ఘాటించింది. వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ పరిమితిని మించినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 2021లో మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ 50 శాతం పరిమితిని మించడంతో సుప్రీంకోర్టు దానిని రద్దు చేసింది. అసాధారణ పరిస్థితులను రుజువు చేయడంలో విఫలమైందని తీర్పు ఇచ్చింది. 2024లో బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్‌ను పాట్నా హైకోర్టు రద్దు చేసింది. కులగణన డేటా సమర్థనీయం కాదని పేర్కొంది. తమిళనాడు 69 శాతం రిజర్వేషన్‌ను 1994లో 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా చట్టబద్ధ రక్షణ పొందింది.

ఇదే విధమైన రాజ్యాంగ రక్షణ కల్పించాలని బిసి కులసంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే గతంలో వెలువడిన తీర్పుల వల్ల తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం కష్టమని వాపోతున్నారు. కేంద్రం 2026లో జనగణనతోపాటు కులగణన చేపట్టనుంది. తెలంగాణ కులగణన గణాంకాలు, కేంద్రం సేకరించే డేటాతో సరితూగకుంటే, రిజర్వేషన్ అమలు మరింత సంక్లిష్టమవుతుంది. కేంద్రం ఆమోదం లేకుండా రాష్ట్రం ఏకపక్షంగా చేసే ప్రయత్నాలు చట్టపరమైన సమస్యలను తెచ్చిపెడతాయి. రాష్ట్రం తన డేటాను కేంద్రానికి సమర్పించి, 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లు, కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నపుడు తెలంగాణలో42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం కష్టమని వాపోతున్నారు.

బిసి రిజర్వేషన్‌లో ముస్లింలను కలిపితే బిజెపి పార్టీ మద్దతు ఇవ్వబోదని ఆ పార్టీ రాష్ట్ర అగ్రనాయకులు బహిరంగగానే ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రం 2026లో జనగణనతో పాటు కులగణన చేపట్టనుంది. తెలంగాణ కులగణన గణాంకాలు, కేంద్రం సేకరించే డేటాతో సరితూగకుంటే, రిజర్వేషన్ అమలు మరింత సరైనప్పటికీ, దీని అమలు చట్టపరమైన, రాజకీయ సవాళ్లతో కూడుకున్నది. సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి, కులగణన డేటా ఖచ్చితత్వంపై సందేహాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఈ నిర్ణయాన్ని సంక్లిష్టం చేస్తున్నాయి. రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చడం లేదా శాస్త్రీయమైన డేటాతో ట్రిపుల్ టెస్ట్‌ను సమర్థించడం ద్వారా ఈ రిజర్వేషన్ చట్టబద్ధమైన రక్షణ పొందగలదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం అధికార, విపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వరకే పరిమితం అవుతుందా, లేదా సమస్య పరిష్కారం అవుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.

  • యం. అర్జున్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News