Sunday, July 20, 2025

మావోల సైద్ధాంతిక మార్పు తప్పనిసరి!

- Advertisement -
- Advertisement -

మావోయిస్టులు సాయుధ దళాల పంథామార్చుకున్నాయని వస్తున్న వార్తలలో నిజం ఎంతైనా ఉండవచ్చు! కానీ, చత్తీస్‌గఢ్‌లో సామూహిక మానవ హననం కాస్తా తగ్గుముఖం పట్టిన జాడలను బట్టి మనం నిర్ధారణకు వస్తున్నాము. ఎదురుదెబ్బ తగిలినప్పుడు ఏపార్టీనైనా తన వ్యూహాన్ని మార్చుకుంటుంది? అందునా విప్లవం పార్టీ అయిన మావోయిస్టు పార్టీ అందుకు మినహాయింపు కాదు. నష్టాలు తగ్గించుకోవడానికి పిఎల్‌జిఎను నలుగురైదుగురు దళాలస్థాయికి కుదించారని, కార్యకర్తలు, నాయకులు ప్రజల్లో కలిసి జీవిస్తున్నారనేది దాని సారాంశం. ఇది మావోయిస్టు కొత్త సిద్ధాంతం ఏమీకాదు! అర్ధవలస, -అర్ధభూస్వామ్య దేశంలో మావో అనుసరించిన ప్రాథమిక వ్యూహాత్మక విధానమే అది. గెరిల్లా పోరాటం! కాకుంటే, మావోయిస్టులే విప్లవ పరిపక్వ స్టేజీలో చేయాల్సిన పిఎల్‌జిఎ ఏర్పాటు ముందే చేయడం, మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎదుర్కొనే వ్యూహం లేకపోవడం మావోయిస్టు పార్టీ నష్టాలకు ప్రధానకారణం.

ఎందుకంటే ఈ పాఠం నక్సల్బరీ కాలంనుండి ఎదురవుతున్నదే? కాకుంటే, గుణపాఠాలలోనే ఏదో సైద్ధాంతిక సెక్టెరియన్ ఇగో ధోరణి అడ్డువస్తున్నట్లు ఉంది. చత్తీష్‌గఢ్ పరిణామాలు (Chhattisgarh developments) చారిత్రకంగా ఒక్క మావోయిస్టు పార్టీకే కాదు విప్లవ పార్టీలకన్నింటికీ గుణపాఠమే? కాల, మాన పరిస్థితులు మార్క్సిజానికి ప్రధానాంశమే! ఒక అర్ధశతాబ్ద కాలం కఠోర విప్లవదీక్షకు అంకితమై, వ్యవస్థ మార్పునకు సంకేతం అవుతారనుకున్న సిపిఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు తదితరుల మరణం విప్లవోద్యమం కార్యకర్తలకు, అభిమానులకు షాకింగ్ అంశమే? ఇప్పుడున్న వ్యవస్థలో సామాజికంగా, రాజకీయంగా మౌలిక మార్పు కోరుకునే ప్రజలకు ఇది అశ నిపాతం లాంటి సంకేతమే! 1970 దశకంలో 200 మందికిపైగా కార్యకర్తలను కోల్పోయిన శ్రీకాకుళం ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో పెద్ద సంఖ్యలో విప్లవోద్యమం కార్యకర్తలను నష్టపోయిన సంఘటన తిరిగి దండకారణ్యం లోనే జరిగింది.

ఇప్పటి వరకు చత్తీస్‌గఢ్ కేంద్రంగా కొనసాగుతున్న ఆపరేషన్ ‘కగార్’లో దండకారణ్యంలో ఇప్పటివరకు 500పైగానే మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులైన గిరిజనులను ఎన్‌కౌంటర్ పేరుతో చంపివేయబడ్డారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పైకి ప్రకటించకుండానే శ్రీకాకుళం అడవులను రక్తసిక్తం చేస్తే! ఇప్పటి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ మావోయిస్టులను మట్టుపెడతామనే బహిరంగ ప్రకటన తో మార్చి 2026 తేదీని కూడా డెడ్‌లైన్ కూడా ప్రకటించి దండకారణ్యంలో ఒక రకంగా మావోయిస్టుల ఏరివేత వేటను కొనసాగిస్తున్నారని చెప్పక తప్పదు? రాజ్యాంగం ప్రతిపాదించిన జీవించే హక్కును కూడా కాలరాస్తున్నారని హక్కుల సంఘాలు మొత్తుకుంటున్నా, కమ్యూనిస్టు పార్టీ లు ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాలలో ఆందోళన చేస్తున్నా? కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నట్లు లేదు.

తాజా పరిస్థితిలోఅనేక మంది గిరిజనులు చనిపోతున్నారు! కనుక కేంద్రం తో చర్చలు జరుపుతామని ఒక అడుగు వెనక్కు వేసి నక్సలైట్లు ప్రకటించినా కేంద్రం తన పట్టు సడలించకుండా మావోయిస్టు పార్టీని వెంటాడి, వేటాడి చంపుతున్నది? అందుకు శత్రుదేశం మీద వాడిన విధంగా డ్రోన్లు, హెలికాప్టర్‌లు వాడుతుంది! ఇండో -పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కూడా దండకారణ్యంలో ఎన్‌కౌంటర్‌లను ఆపలేకపోయాయి? ఈ స్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం కమ్యూనిస్టు వ్యతిరేక ఒక దృఢమైన అతివాద హిందూ సైద్ధాంతిక నిబద్ధత కలిగిన సంఘ్ పరివార్ ఎజెండా అమలు పరిచే శక్తులు కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో, ముఖ్యంగా అధికారంలో ఉండడమే కారణం కావచ్చునేమో? కనీసం కనికరం, మానవత్వం లేని రక్తపాతాన్ని బహిరంగంగా చెప్పడం వెనుక ఆంతర్యం కూడా ప్రశ్నించే తత్వాన్ని హతమార్చే వ్యూహం తప్ప మరొకటి కాదు!

అయితే మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి మరణంలో కోవర్టు పాత్ర ఉందని, అనేక మరణాల వెనుక కోవర్టు పాత్రలు ఉన్నాయని బహిరంగంగా ప్రకటించిన మావోయిస్టు పార్టీ కోవర్టులు అనబడే సమస్యను గత యాభై ఏళ్ళుగా ఎందుకు అధిగమించలేకపోయిందనేది ప్రశ్నార్థకం? ఇన్నేళ్ళ పోరాటంలో ఇంకా ఇదో చిక్కు సమస్యే అయితే? ఎందుకు  అధిగమించలేకపోయారనేది కొత్త పాఠం ఏమీ కాదు, పాత పాఠమే! ఇదే సమయంలో దేశంలో మావోయిస్టు ఆచరణకు ఏకైక గీటురాయిగా భావించిన జనతన సర్కార్, దండకారణ్యం విప్లవోద్యమం ఒడిదుడుకులకు లోనుకావడం అనేది.

దేశవ్యాప్తంగా సామాజిక, మౌలిక మార్పు, రాజకీయ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నా సామాన్య ప్రజలకు ఈ దండకారణ్యం పరిణామాలు నిరాశ, నిస్పృహ పర్చాయనడంలో సందేహం లేదు! ఇక మావోయిస్టు సిద్ధాంతం అనుసరించే శ్రేణులు కూడా తమ సైద్ధాంతిక పునాది మారకపోయినా! ఎత్తుగడలు, పోరాట వ్యూహాలు అమలులో మార్పులు, చేర్పులు గురించి ఆత్మసమీక్ష ఇప్పటికైనా అవసరమే? యాభైఏళ్ళు పైబడిన నక్సలైట్ ఉద్యమం ఎందుకు ఇంకా తప్పటడుగులు వేస్తుంది? మావోయిస్టు సైద్ధాంతిక నేపథ్యం స్వీకరించిన వారిలో ఎందుకు ఇన్ని, వైవిధ్యాలు, గ్రూపులు ఉన్నాయి? నక్సలైట్లు, ప్రజల త్యాగాలను దండకారణ్యం పరిణామాల నేపథ్యంలో ఒక్కసారి సమీక్షించుకుంటే!

భూసమస్య కేంద్రంగానే నక్సలైట్ ఉద్యమం అంకురార్పణ జరిగింది. 1969లో నక్సల్బరీ ఉద్యమం, దాని మార్గదర్శకంలో వచ్చిన శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఆనాటి ప్రభుత్వం ఎన్‌కౌంటర్స్ ద్వారా ముఖ్యనేతలను హతమార్చడం ద్వారా అణచివేశారు. ఇక నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో గోదావరి లోయలో గిరిజనుల పోడుభూముల ఉద్యమం, సిరిసిల్ల, జగిత్యాల భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా ముందుకు వచ్చింది. అటు తర్వాత ఆ ఉద్యమాలు రక్తపుటేరులు పారించి పాలకులు అణచివేతకు గురిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం ముక్కచెక్కలుగా మారి ప్రస్తుతం సిపిఐ ఎంఎల్ పేరుతో అనేక గ్రూపులు మనుగడ సాగిస్తున్నాయి. ఇల్లెందు, సిరిసిల్లలో ఆయా గ్రూపులు తెలుగు రాష్ట్రంలో శాసనసభలో కూడా ప్రవేశించారు. తెలంగాణలో చైతన్యం పొందిన మావోయిస్టులు, ఉన్నత విద్యావంతులు దండకారణ్యం కేంద్రంగా పనిచేసి ఓ సాయుధ క్యారిడార్ నిర్మాణానికి అంకురార్పణ చేశారు.

గత 30 ఏళ్ళుగా నక్సలైట్ ఉద్యమం చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, బీహార్, బెంగాల్ రాష్ట్ర దండకారణ్యంలో గిరిజన ప్రజలను సమీకరించి మధ్య భారతంలో ఓ బలమైన విప్లవోద్యమం నిర్మాణానికి పునాదులు వేశారు. అంతేకాదు మావోయిస్టు సిద్ధాంతం అమలు మోడల్‌గా దండకారణ్యంలో ప్రజల ప్రత్యామ్నాయ ప్రభుత్వం పేరుతో జనతన సర్కార్ ఏర్పరిచారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌జిఎ) ప్రారంభించారు. వేలమంది త్యాగాలతో నిర్మితం అయిన ఉద్యమం అణచివేతకు గురై ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం పరిణామాలు గమనించిన ప్రజలకు కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 1949లో ఆనాటి చైనా పరిస్థితి కనుగుణంగా రూపొందించిన గెరిల్లావార్ వ్యూహం అమలు, రవాణా సౌకర్యాలు ర్యాపిడ్‌గా మారిన, సాంకేతిక పరిజ్ఞానం చాలా వేగంగా విస్తరించిన ఈ దశలో ఎంతవరకు సబబు? సాయుధ పోరాట సంకల్పం కాలానుగుణంగా ఉందా? లేదా? నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ, ఇప్పుడు దండకారణ్యం నేర్పుతున్న పాఠాలు, గుణపాఠాలు ఇప్పుడైనా మావోయిస్టులు సమీక్షించుకోవాలసిన అవసరం ఉంది.

ఒకవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలు, మిలిటరీ స్థావరాలు కొన్ని నిమిషాల వ్యవధిలో ధ్వంసం చేశాయి. ఇలాంటి ఆధునిక భారత సైన్యాన్ని దండకారణ్యంలో మావోయిస్టుల అణచివేతకు పెద్దఎత్తున కేంద్రం ఉపయోగిస్తున్నప్పుడు కేవలం తమ దగ్గర ఉన్న తుపాకులతో ప్రజల రక్షణ సరే! తమను తాము కాపాడుకునే స్థితి లేదు? 30 ఏళ్ళుగా అనేక ఒడిదుడుకులు, అష్టకష్టాలుపడి నిర్మించిన ఉద్యమం కళ్ళ ముందే కుప్పకూలుతుంటే? ఆచరణ, అనుభవాలు నుండి మావోయిస్టులు పాఠాలు తీసుకోవాల్సిన అవసరం ముందుకు వచ్చింది.

మార్క్సిజం గురించి, మావోయిస్టుల గురించి మాలాంటి వారు మాట్లాడడం హాస్యాస్పదం అనిపించినా అనిపించవచ్చు? కానీ, మార్క్సిజం జడపదార్థమో? పిడి వాదమో? కానేకాదు! పరిస్థితి కనుగుణంగా మార్చుకోవాలసిన సంకేతాలు ఇచ్చే నిత్యనూతన సిద్ధాంతం? ఇప్పటికీ ప్రపంచాన్ని అంతగా ప్రభావితం చేసిన సామాజిక సిద్ధాంతం లేనే లేదు? మరి మావోయిస్టులు తమ సైద్ధాంతిక పునాది కనుగుణంగా ప్రస్తుత పరిస్థితి కనుగుణంగా మారతారా? లేక పాత సిద్ధాంత పునాది వీడేది లేదని ప్రకటిస్తారా? అనేది వారివారి ఇష్టం. కానీ ప్రజల ప్రయోజనాలు కాంక్షించే మనం కూడా ప్రజల్లో అంతర్భాగం అనే ప్రాథమిక సూత్రం మాత్రం వారికీ వర్తిస్తుంది! నక్సలైట్ల త్యాగాలను అర్థం చేసుకుంటే వారి నైతికతను, పట్టుదలనూ, సైద్ధాంతిక నిబద్ధ్దతనూ ఎవరూ తప్పుపట్టలేరు సరికదా! విస్తరిల్లుతున్న అవకాశవాద రాజకీయాల ఊబిని చూస్తున్నప్పుడు, నూటికి నూరు శాతం నిజాయితీకి నిలువుటద్దం మావోయిస్టులే కనిపిస్తారు!

అయితే, మారుతున్న కాల, మాన పరిస్థితుల్లో మావోయిస్టు త్యాగాలు నేర్పుతున్న పరమార్థం ఏమిటి? సందేశం ఏమిటి? త్యాగాలకు కొన్ని పరిమితులు అవసరమే కదా? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అబివృద్ధి చెందుతున్న ఈ దశలో అందుకనుగుణంగా మావోయిస్టులు వ్యూహం, ఎత్తుగడలలో, సైద్ధాంతిక ఆచరణీయ స్థితిలో ఉన్న పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిన అవసరం ముందుకు వచ్చింది. పాలకులు కూడా మావోయిస్టులు ఒక అడుగు వెనక్కువేసి చర్చలు కోరుకున్నప్పుడు ఇంత పాశవికంగా, ఆటవికంగా హతమార్చవలసిన అవసరం లేదు? శవాలను కూడా తామే దహనం చేసే పాశవికత, శవాలు ముందు పిశాచ నృత్యాలు చేయాల్సిన అనైతికత అవసరం లేదు? అటు ప్రభుత్వం, ఇటు మావోయిస్టుల సాయుధ చర్యల మధ్యలో నలిగిపోతున్న, ఛిద్రం అయిపోతున్న గిరిజన ప్రజల దైనందిన జీవితం గురించి సంయమనం పాటించడం, ఇరువైపులా ఆలోచించడం ఇప్పటికిప్పుడు, అత్యవసరమే మరి!

  •  ఎన్ తిర్మల్
    94418 64514
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News