Sunday, July 20, 2025

జిలేబీ, సమోసాలపై హెచ్చరికలా!

- Advertisement -
- Advertisement -

ఆరోగ్యకరమైన ఆహారం అలవాట్ల వల్లెనే జీవనశైలి చక్కగా సాగుతుంది. తీసుకున్న ఆహారంలో అత్యధిక మోతాదులో నూనెలు, చక్కెర, వినియోగిస్తుండటంతో అనేక రకాల వ్యాధులు దాపురిస్తున్నాయి. ముఖ్యంగా స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాలు సంక్రమించడానికి అతిగా వేపుళ్లు, చక్కెర, నూనెవంటకాలు, ఉప్పు కారంతో నిండిన స్నాక్స్ వంటివి కారణమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి ఆహార, పానీయాలు తీసుకోవడం మానకుంటే దేశంలో 44 కోట్ల మంది స్థూలకాయులుగా మారిపోతారని లాన్సెట్ జర్నల్ నివేదిక ఇటీవలనే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని లక్షాలని అమలు చేయడానికి సిద్ధమవుతోంది.

ఇదే లక్షంతో నాగపూర్ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) క్యాంపస్‌లో ఏయే ఆహార పదార్ధాలను తీసుకుంటే ఎలాంటి వ్యాధులు వస్తాయో హెచ్చరిస్తూ భారీ పోస్టర్లు, బోర్డులు ప్రదర్శించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. సమోసా, జెలేబీ, (Samosa,Jalebi) వడాపావ్, లడ్డూలు తదితర సంప్రదాయ వంటకాలతోపాటు చిరుతిళ్లవల్ల తలెత్తే అనారోగ్య సమస్యల గురించి వివిధ మార్గాల ద్వారా హెచ్చరికలు ముమ్మరంగా ప్రచారం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వశాఖలు, విభాగాలకు ఆదేశాలిచ్చింది. ఈ శాఖ కార్యదర్శి శ్రీవాత్సవ జూన్ 21న వివిధ శాఖలకు లేఖలు రాశారు. మొదట ప్రయోగాత్మకంగా నాగపూర్ ఎయిమ్స్ నుంచి ఈ కేంపైన్ ప్రారంభమవుతుంది.

ఈ విధమైన చొరవ రెండు నెలల క్రితం సిబిఎస్‌ఇ చేపట్టింది. సిబిఎస్‌ఇ తన అనుబంధ స్కూళ్లు అన్నిటికీ చక్కెర తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు పిల్లలు తీసుకునే విధంగా సూచనలతో సుగర్‌బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించింది. చక్కెర అధిక శాతం వినియోగించడం వల్ల 2005 2021 మధ్యకాలంలో పురుషుల్లో 15% నుంచి 24% అలాగే మహిళల్లో 12% నుంచి 23% ఊబకాయం పెరిగిందని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ డేటా వెల్లడించింది. దేశంలోని స్నాక్స్‌లో చక్కెర, నూనె ఏమోతాదులో వాడుతుంటారో స్పష్టం కానప్పటికీ, వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్చరికల అవసరం ఎంతైనా ఉంది. పొగాకు ఉత్పత్తులపై ఏ విధంగా హెచ్చరికలు ప్రదర్శిస్తున్నారో అదే విధంగా స్నాక్స్‌పై కూడా హెచ్చరికలు అమలు చేయడం తప్పనిసరి.

అయితే జిలేబీ, సమోసా తదితర వంటకాల్లో నూనె, చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయని, సిగరెట్ ప్యాకెట్లపై పెట్టిన హెచ్చరిక బోర్డుల్లాగే ప్రజలకు అవగాహన కల్పించేందుకు బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించినట్టు వచ్చిన వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే జారీచేశామని సంబంధిత వంటకాల పేర్లను ప్రస్తావించలేదని స్పష్టం చేసింది. అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం జిలేబీ, సమోసా, లడ్డూల్లో అధిక మొత్తంలో నూనె, చక్కెర స్థాయిలు ఉండటం వాస్తవమే. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్యానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక గులాబ్ జామ్‌లో దాదాపు నాలుగైదు టీస్పూన్‌ల చక్కెర ఉంటుంది. అదే ఒక సమోసాలో 11 నుంచి 12 గ్రాముల ఆయిల్ ఉంటుందని అంచనా.

ఇలాంటి ఆహార పదార్థాలు రోజూ తింటే ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వీటిపై నిషేధం విధించాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదు. కానీ వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. స్నాక్స్‌పై ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇప్పుడు కళ్లుతెరిచి హెచ్చరికలు జారీ చేయడం విస్మయం కలిగిస్తోంది. ఎందుకంటే అనారోగ్యకర ఆహార ప్యాకేజీలపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలన్న సంగతే గత కొన్నేళ్లుగా పట్టించుకోవడం లేదు. ఈ ప్యాకేజీల మార్కెట్‌ను క్రమబద్ధీకరించడం కానీ, ప్రకటనలను నివారించడం కానీ ఏవీ జరగడం లేదు. కొవ్వు, చక్కెర, ఉప్పు అత్యధిక స్థాయిలో ఉండే ఆహార పదార్ధాల ప్యాకేజీలపై విదేశాల్లో అదనపు పన్నులు విధిస్తూ వినియోగాన్ని తగ్గించ గలుగుతున్నారు.

డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, రక్తపోటు వంటి కామన్ నాన్‌కమ్యూనికబుల్ వ్యాధుల నివారణకు, నియంత్రణకు జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలు చేసినట్టుగానే ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) నిబంధనలు కూడా సవరించవలసి ఉంది. ఈమేరకు ఫుడ్ ప్యాకెట్ల కవర్‌పై లేబుళ్లపై ఆయా పదార్ధాల పోషక విలువల శాతం వివరిస్తూ హెచ్చరికలు ముద్రించవలసి ఉంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ (ప్యాకేజింగ్ అండ్ లేబెల్లింగ్) రెగ్యులేషన్ 2020 లో సవరణలు జరిగాయి. సుప్రీం కోర్టు కూడా ఈఫుడ్ ప్యాకెట్లపై లేబిళ్లు ప్రచురించాలని కూడా ఆదేశించింది. హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ (హైలెవెల్స్ ఆఫ్ ఫ్యాట్, సుగర్, అండ్ సాల్ట్) ఫుడ్ అండ్ బెవరేజి ఉత్పత్తులపై లేబిళ్లు ముద్రించాలని, అందులో హెచ్చరికలు సూచించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ అంటే అత్యధిక స్థాయిల్లో కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్నాయని నిర్వచించాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఇది ఖరారు కాలేదు సరికదా ఆమోదం పొందలేదు. ఐసిఎంఆర్‌ఎన్‌ఐఎన్ అధ్యయనంలో హెచ్చరికల లేబిళ్లు, న్యూట్రీస్టార్ రేటింగ్స్, ఒక మోస్తరు అనారోగ్యకర ఆహార పదార్ధాలనైనా వినియోగించేందుకు నిర్ణయం తీసుకోడానికి తోడ్పడ్డాయని తేలింది. అనారోగ్యకర ఆహార పదార్ధాల వినియోగాన్ని చట్టపరంగా నియంత్రించే పాలనాపరమైన విధానాలు అమలు కాకుంటే వాటిపై అవగాహన కల్పించడానికి ఎంతగా హెచ్చరికలు ముద్రించినా అవి గుర్తులు గానే మిగిలిపోతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం నెరవేరదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News