హైదరాబాద్: వరంగల్ ప్రజల కోరికను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. కాజీపేట రైల్వేకోచ్ పరిశ్రమ అనేది వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు. రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్రమంత్రులు పరిశీలించారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా సాగుతున్నాయని తెలియజేశారు.2026లో ఇక్కడ రైల్వే కోచ్ పనులు ప్రారంభం అవుతాయని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ అనేది 40 ఏళ్ల పోరాటమని, పివి నరసింహారావు కూడా కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించారని కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే వ్యాగన్లు, కోచ్ లు, ఇంజిన్ల తయారీ పరిశ్రమను కాజీపేటకు ప్రధాని మంజూరు చేశారని, మోడీ ఏదైనా మాట ఇస్తే.. తప్పకుండా నెరవేరుస్తారని పేర్కొన్నారు.మోడీ గ్యారెంటీకి ప్రతిరూపమే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అని కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని స్వయంగా భూమిపూజ చేశారని అన్నారు.
కోచ్ ఫ్యాక్టరీతో 3 వేల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తామని, తెలంగాణలోని 40 వేల రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నాం అని తెలియజేశారు. వరంగల్ కు ఎయిర్ పోర్టు కూడా ఇప్పటికే రావాల్సి ఉందని, ఎయిర్ పోర్టుకు భూములివ్వాలని గతంలో మాజీ సిఎం కెసిఆర్ ను కోరామని చెప్పారు. భూసేకరణ గురించి ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నామని, ఎంత త్వరగా భూములిస్తే.. అంత త్వరగా ఎయిర్ పోర్టు పూర్తవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.