హైదరాబాద్ ( కాచిగూడ ) – జోధ్‌పూర్ (భగత్- కీ -కోఠి) నూతన ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. శనివారం నూతన ఎక్స్‌ప్రెస్ రైలు ను కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు , ఇతర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ హైదరాబాద్ నుండి జోధ్‌పూర్‌కు రోజువారీ రైలు నడపడం హైదరాబాద్‌లో నివసిస్తున్న రాజస్థానీ సమాజం చిరకాల స్వప్నమని అన్నారు. గతంలో పరిమితుల కారణంగా రైలును ప్రారంభించలేకపోయామని తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైలు మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయని, కొత్త ట్రాక్‌ల నిర్మాణం, కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం, సామర్థ్యం పెరగడం వల్ల హైదరాబాద్ నుండి జోధ్‌పూర్‌కు ఈ ప్రత్యక్ష రోజువారీ రైలు నడపడానికి వీలు కలిగిందని అన్నారు.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నుండి జోధ్‌పూర్‌కు రోజువారీ రైలు కోసం రాజస్థానీ సమాజం చిరకాల కల నెరవేరిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, వీటిలో బేగంపేట, వరంగల్, కరీంనగర్ అమృత్ స్టేషన్లను ఇటీవల ప్రారంభించుకున్నామని తెలిపారు. తెలంగాణ రైలు నెట్‌వర్క్‌లో 100 శాతం విద్యుదీకరణ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. కొత్తగా చర్లపల్లి స్టేషన్‌ను అత్యాధునిక ప్రయాణ సౌకర్యాలతో అభివృద్ధి చేసి, ఇటీవలే ప్రారంభించామన్నారు. సికింద్రాబాద్ స్టేసన్ ఆధునీకరణకు రూ.720 కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్ పని వచ్చే ఏడాది పూర్తవుతుందని తెలిపారు. అంతకు ముందు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ స్వాగతోపన్యాసం చేశారు. ఈ నూతన రోజువారీ రైలు రిజర్వ్, అన్ రిజర్వ్ విభాగాల ప్రజల అవసరాలను తీరుస్తూ హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న దేశంలోని మధ్య,
వాయువ్య రాష్ట్రాల ప్రజలు తమ స్వస్థలాలకు ప్రయాణించడానికి ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు , సెలవుల్లో విరివిగా ప్రయాణించేవారికి, ప్రత్యేక పర్యటనలకు చేసే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. వాణిజ్యం, వాణిజ్య మార్గాలను పెంచడంతో పాటు పర్యాటకం, తీర్థయాత్రలను ప్రోత్సహించడంలో కూడా ఈ రైలు సహాయపడుతుంది. రెగ్యులర్ డైలీ రైలు సర్వీసులు కాచిగూడ -భగత్ కీ కోఠి (17605) ఆదివారం నుండి అమలులోకి వస్తుంది. భగత్ కి కోఠి – కాచిగూడ (17606) రైలు ఈ నెల 22 నుండి అమలులోకి వస్తుంది.