కేంద్రమంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపి
ఈటల రాజేందర్ మధ్య భగ్గుమన్న విభేదాలు
ఈటల వర్గానికి పదవులు ఎలా వస్తాయో
చూస్తానని బండి సంజయ్ హెచ్చరించినట్లు
ఆరోపణలు బీ కేర్ ఫుల్..అసలు నవ్వు
ఎవడివంటూ ఈటల వ్యాఖ్యలు స్థానిక
ఎన్నికల వేళ వివాదాలతో పార్టీలో గందరగోళం
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర బిజెపిలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి, మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్‌కు మధ్య అంతర్గతం గా ఉన్న ‘లడాయి’ ఇప్పుడు బహిరంగమైంది. ఈటల వర్గానికి పార్టీ పదవుల్లో కానీ కేంద్రం నియమించే పదవుల్లో గా నీ ఏ ఒక్కరికీ రాకుండా చూస్తానని కేం ద్ర మంత్రి బండి సంజయ్ అన్నట్లు ఈ టల వర్గం ఆరోపిస్తున్నది. అంతేకాకుండా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి సుమారు వెయ్యి మంది ఈటల అనుయాయులు శనివారం శామీర్‌పేటలోని నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఈటల వారినుద్ధేశించి ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి బండి పేరు ప్రస్తావించకుండానే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘నా కొడుకా, అసలు నువ్వెవడివి’ అంటూ ఉపయోగించిన పరుష పదజాలం సోషల్ మీడియలో చక్కర్లు కొడుతున్నది. ఈ వ్యాఖ్యలు ఈటల ఎవరిని ఉద్ధేశించి అన్నారన్న చర్చ జరుగుతున్నది.
రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదని ఈటల వర్గం గుర్రుగా ఉంది. అంతేకాకుండా లోగడ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గం ఇన్‌ఛార్జి గౌతం రెడ్డి, శనిగరం వెంకట రెడ్డి ప్రభృతులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం వెంకటరెడ్డి, గౌతం రెడ్డి, సుందర్ రాజ్, శ్యామ్ ఇంకా సుమారు వెయ్యి మంది కార్యకర్తలు ఈటల నివాసానికి చేరుకుని కేంద్ర మంత్రి బండితో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు.
పార్టీలో తమకు గుర్తింపు లేదని, ఈటల వర్గాన్ని ఎదగకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈటలకు పార్టీ అధ్యక్ష పదవికి రాకుండా అడ్డుకున్న వాడిని తనకు ఈటల వర్గానికి పదవులు ఎలా వస్తాయో చూస్తానంటూ పార్టీ అంతర్గత సమావేశంలో బండి వ్యాఖ్యానించారని వారు ఆరోపించారు. పార్టీలో బండితో వేగలేకపోతున్నామని వారు తమను బాధను వ్యక్తం చేశారు. ఇరవై ఐదు ఏళ్ళుగా మీ వెంట ఉన్న మా భవిష్యత్తు ఏమిటీ? అని హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు గట్టిగా ఈటలను అడిగారు. మీరేమో మల్కాజిగిరికి వచ్చి ఎంపి అయ్యారు, కానీ మమ్మల్ని అనాధలుగా చేస్తారా? మాకు గుర్తింపు ఎవరు ఇస్తారు?, ఏ పదవి లేకుండా ప్రజల్లోకి ఎలా వెళ్ళగలం, వారికి ఏ విధంగా సేవ చేయగలం అంటూ ప్రశ్నించడంతో ఈటల తనదైన శైలిలో స్పందించారని తెలిసింది.
బండిపై ఈటల మండిపాటు
ఇదిలాఉండగా హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని నాయకులు చెప్పిన అంశాలతో, ఎదురు అవుతున్న ఇబ్బందులు విన్న ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బీ కేర్ ఫుల్ నా కొడకా, అసలు నువ్వెవడివి అంటూ భగ్గుమన్నారు. ‘నేను ఎప్పుడైనా స్ట్రెయిట్ ఫైట్ చేస్తా… నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను, నా చరిత్ర గురించి నీకు తెలియదనుకుంటా..’ అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. నేను ఎప్పుడైనా శతృవుతో పోరాడుతానని, నీ వలే కడుపులో కత్తులో పెట్టుకుని కౌగిలించుకోనని అన్నారు. తాను వైఎస్ రాజశేఖర రెడ్డి, కెసిఆర్‌తో పోరాటం చేశానని అన్నారు. ఎవడో సైకో ఏదో పోస్టు చేశాడని, వాడి సంగతి తానే చూసుకుంటానని, ఈ విషయాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళతానని ఈటల వివరించారు. హుజురాబాద్ ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చాయో, ఎంపికి కూడా అన్ని ఓట్లు వేయించానని ఆయన తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తన మనుషులను బరిలోకి దింపుతా, వారిని గెలిపించుకునే బాధ్యత తనదేనని ఈటల ఖరాఖండిగా చెప్పారు. హుజురాబాద్ ప్రజలు తనను ఏడు సార్లు అసెంబ్లీకి గెలిపించారని, తాను ఎవరికీ భయపడనని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడరాదని తాను మీ వెంటే ఉంటానని ఈటల భరోసా ఇచ్చారు.
ఈ పంచాయితీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. క్రమశిక్షణ గల బిజెపిలో ఈ పంచాయితీ ఏమిటీ? అని పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా ఉంది. అంతేకాకుండా దీనిపై ఆరా తీస్తున్నదని సమాచారం. కాగా బండి సంజయ్ వర్గం మాత్రం ఈ విషయంలో కలత చెందింది. ఈటలకు పార్టీలో గుర్తింపు ఇచ్చామని, ఆయన వర్గీయులకు పదవులూ కట్టబెట్టామని చెబుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తొమ్మిది మందికి పదవులు కట్టబెట్టినట్లు బండి అనుయాయులు చెబుతున్నారు. ఒబిసి మోర్చా మండల అధ్యక్షునిగా మందాల సాయి బాబా, బిజెపి మండల కార్యదర్శిగా పంజాల లక్ష్మి ఇంకా కంకణాల తిరుపతి, కంకణాల స్వామి, రావుల శ్రీనివాస్, బండారి లావణ్య, పంజాల వెంకన్న, గోపగోని సమ్మయ్య, సరోజనకు పదవులు ఇచ్చినట్లు వారు తెలిపారు.
స్ట్రెయిట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ రాదు : ఈటల
తనకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా… స్ట్రీట్ ఫైట్ రాదని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు శామీర్‌పేటలోని ఈటల నివాసానికి తరలివచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గం తమను దూరం పెడుతోందని, పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వడం లేదని ఈటల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సందరర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాలం చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. మీదికి ఒక మాట.. లోపల ఒక మాట మాట్లాడటం తన రాదని అన్నారు. బాజప్తా మాట్లాడతా.. బేజాప్తా మాట్లాడటం రాదని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ చైతన్యానికి మారుపేరని అన్నారు. తాము బిఆర్‌ఎస్ నుంచి బయటకు రాలేదని, బలవంతంగా వెళ్లగొట్టారని ఆరోపించారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు ఉంటాయని వాటిని తట్టుకున్నామని అన్నారు. 2021 నుండి బిఆర్‌ఎస్‌లో నరకం అనుభవించానని గుర్తుచేశారు. కానీ ప్రజలు ఎప్పుడూ మోసం చేయరని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన అడుగు పడని పల్లె లేదని, తన చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసునని అన్నారు. ధీరుడు వెనుదిరగడు.. ఎంత వరకు ఓపిక పట్టాలో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.
హుజురాబాద్‌లో గత 20 ఏళ్లుగా ఎప్పుడూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదన్నారు. వ్యక్తులు ఎదగకుండా పార్టీ బలపడలేదని, కార్యకర్తల ఆవేదన తనకు అర్థమైందని, వారి రాజకీయా అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా తాను లేనని అన్నారు. తన అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుందని, పదవులే పరమావధిగా భావించేవాడిని కాదని, ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. కురుచ స్వభావులు మిమ్మల్ని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదని, కొత్త, పాత వాళ్ళు అనే భావన లేదని, ఎవరి దయాదాక్షిణ్యాలు తనకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. కోవర్టులు రాజకీయాల్లోనే కాదు.. అన్నింట్లోనూ ఉంటారని, వారి గురించి బాధపడవద్దని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ‘హుజురాబాద్ వస్తా..మీ వెంటే ఉంటా మిమ్మల్ని గెలిపించుకుంటా’ అని ఈటల వారికి హామీ ఇచ్చారు. పది రోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తానని అన్నారు. కార్యకర్తలు కుంగిపోవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.