ఘజియాబాద్: యాత్రికులపైకి అంబులెన్స్ దూసుకుపోవడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. కద్రాబాద్ సమీపంలోని ఢిల్లీ-మీరట్ హైవేపై ప్రమాదవశాత్తు కంట్రోల్ తప్పిన అంబులెన్స్.. కన్వర్ యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వార్షిక కన్వర్ యాత్ర కోసం గంగానది నుండి నీటిని సేకరించడానికి యాత్రికులు హరిద్వార్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
నిన్న రాత్రి 11.45 గంటల సమయంలో దూసుకొచ్చిన అంబులెన్స్.. స్కూటర్, బైక్ లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు రోడ్డుపై ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో కన్వర్ యాత్రికుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం మోడీనగర్‌లోని లైఫ్ హాస్పిటల్‌కు, మీరట్‌లోని సుభార్తి హాస్పిటల్‌కు తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.