Sunday, July 20, 2025

చందమామ అందిన రోజు!

- Advertisement -
- Advertisement -

చంద్రుడు అనగానే ప్రతి భారతీయుడి మనస్సులోనూ చందమామ కథలు, శిశువులకు చెప్పే లోక గీతాలు, కవిత్వపు ఊహలు, పౌరాణిక సందర్భాలు వెంటనే గుర్తుకొస్తాయి. కానీ శాస్త్రీయ దృష్టిలో చంద్రుడు మానవ జిజ్ఞాసకు, సాంకేతిక సామర్థ్యానికి అసాధారణ పరీక్షా కేంద్రంగా నిలిచాడు. ఖగోళ పరిజ్ఞానానికి ఒక మలుపు తిప్పిన ఘట్టం, మానవజాతి కలలకూ, సంకల్పాలకూ నిత్య గుర్తుగా నిలిచి పోయింది. 1969 జూలై 20న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన అపోలో-11 మిషన్ విజయ వంతంగా చంద్రునిపై మానవ తొలి అడుగును ముద్రించింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. అతడు పలికిన ‘ఇది మనిషికి ఒక చిన్న అడుగు, మానవాళికి ఒక పెద్ద గంతు‘ అనే మాటలు శతాబ్దాలుగా శాస్త్రీయ పరిశోధనలకు మైలు రాళ్లుగా నిలిచాయి.

ఆర్పిటర్లో మైఖేల్ కాలిన్స్ (Michael Collins Orbiter) ఉండగా, బజ్ ఆల్డ్రిన్ కూడా చంద్రుడిపై నడిచిన రెండో వ్యక్తి అయ్యాడు. అపోలో 11 మిషన్ మొత్తం 8 రోజులు, 3 గంటలు, 18 నిమిషాల పాటు కొనసాగింది. దీని విజయంతో ప్రపంచం మొత్తం ఆశ్చర్య పోయింది. టెలివిజన్ తెరల, రేడియోల ముందు కోట్లాది మంది ఆ క్షణాన్ని కన్నీటి ఆనందంతో చూశారు, విన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూలై 20ను అంతర్జాతీయ చంద్ర దినోత్సవంగా అధికారికంగా గుర్తించి, అంతరిక్షం పట్ల శాంతియుత ప్రయోగాలు, సాంకేతిక సహకారం, శాస్త్రీయ విజ్ఞానం పట్ల మానవతా బాధ్యతను తెలియ జేసింది. ఈ దినోత్సవం ద్వారా మానవ విజ్ఞాన గమనాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో అంతరిక్షంలో మానవ ప్రస్థానం ఎలా ఉండబోతుందో పట్ల చర్చలకు, ప్రేరణలకు అవకాశం కలుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలోని ఖగోళ పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలు, ప్లానెటోరియంలు, అంతరిక్ష కేంద్రాలు ఈ రోజున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ, చంద్రునిపై జరిగిన తొలి మిషన్ విజయాన్ని గుర్తుచేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

భారత దేశం కూడా చంద్ర అన్వేషణలో విశేషమైన పాత్ర పోషిస్తోంది.ఇస్రో చేపట్టిన చంద్రయాన్-1 మిషన్ 2008లో చంద్రునిపై నీటి ఆనవాళ్లు గుర్తించింది. ఇది ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2 ద్వారా మరింత మెరుగైన టెక్నాలజీతో ల్యాండర్ పంపించగా, చివరిదశలో ల్యాండింగ్ విఫలమైనప్పటికీ ఆర్బిటర్ విజయవంతంగా పనిచేసి శేష గగనచార ప్రణాళికలకు మార్గదర్శిగా నిలిచింది. 2023లో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై దక్షిణ ధృవ ప్రాంతంలో ల్యాండింగ్ చేసి భారత ఖగోళ విజ్ఞానానికి ఒక చరిత్రాత్మక ఘట్టాన్ని చేర్చింది. భారత్ చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా గర్వించదగిన స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం చంద్రునిపై నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనా స్పేస్ ప్రోగ్రామ్, జపాన్, ఇస్రో వంటివి మానవ అన్వేషణకు సిద్ధమవుతున్నాయి. నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్ ద్వారా మళ్లీ మానవులను చంద్రునిపై పంపించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

చంద్రునిపై శాశ్వత స్థావరాలు, నీటి వనరులు, జీవవాస పరిస్థితులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. భవిష్యత్ మానవ అంతరిక్ష ప్రయాణాల కోసం చంద్రుడు ప్రయోగశాలగా మారబోతున్నాడు. అంగారక గ్రహంపై మానవ యాత్రకు పునాది కూడా చంద్రుడే కానుంది. చంద్రుడు కేవలం ఒక ఖగోళ వస్తువు కాదు. మానవతా కలల ఆకృతి. శాస్త్రజ్ఞుల పరిశోధనకు కేంద్రం. కవుల ఊహలకు ప్రతిరూపం. పురాణాల్లో శాంతి సంకేతంగా, తేజోమయమైన దేవతగా వెలుగొందింది. ఇప్పుడు మానవ విజ్ఞాన సాధనకు మార్గదర్శకంగా నిలుస్తోంది. అంతర్జాతీయ చంద్ర దినోత్సవం మానవ శ్రమ, సంకల్పానికి ఘన నివాళిగా, భవిష్యత్ శాస్త్రీయ ప్రయాణాలకు ప్రేరణగా నిలుస్తోంది. ఇది మానవ జాతి ఏకత్వాన్ని, శాస్త్ర విజ్ఞాన శక్తిని, మరియు భవిష్యత్ స్వప్నాలను ప్రతిబింబించే వెలుగురేఖ. జూలై 20 చంద్ర దినోత్సవం కేవలం ఒక స్మారక రోజు కాదు – అది మానవత కోసం వెలిగే అక్షయ దీపం.

  • నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం
  • రామ కిష్టయ్య, సంగనభట్ల 94405 95494
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News