నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ తోపాటు దాసోజు శ్రవణ్ పరామర్శించారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 53 ఏళ్ల ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయనను కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన మృతి తర్వాత నివాళర్పించేందుకు సినిమా వాళ్లెవ్వరు కూడా రాలేదు. ఒక్క గబ్బర్ సింగ్ బ్యాచ్ తప్ప. ఆయనకు సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో బిఆర్ఎస్ నేతలు, హైదరాబాద్ ఎమ్మెల్యేలు అయిన తలసాని, పద్మారావు గౌడ్.. వారితోపాటు దాసోజు ఆదివారం రామ్ నగర్ లోని ఫిష్ వెంకట్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు.అలాగే ఫిష్ వెంకట్ ఆస్పిటల్ బిల్లు రూ.18 లక్షలు తలసాని ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా.. రాంనగర్‌లో నివాసం ఉంటున్న వెంకట్ నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు. డైరెక్టర్ వీవీ వినాయక్ ఆయన్ను నటుడిగా పరిచయం చేశారు. వెంకట్ వందకు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్తుగా సినీప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్ని, అత్తారింటికి దారేది, గబ్బర్‌సింగ్, డీజె టిల్లు, కింగ్, డాన్ శీను, మిరపకాయ్, సుప్రీమ్, దరువు తదితర హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ చిత్రంలో నటించారు.