Monday, July 21, 2025

సభలో రమ్మీఆడుతూ కెమెరాకు చిక్కిన మంత్రి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా వ్యవసాయ శాఖమంత్రి మాణిక్ రావ్ కోకాటే సభలో తన మొబైల్ ఫోన్ లో ఆన్ లైన్ లో రమ్మీ గేమ్ ఆడుతూ కెమెరా కంటికి చిక్కారు. వీడియో బయటకు రావడంతో మంత్రి వివాదంలో చిక్కు కున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ ) నాయకుడు రోహిత్ పవార్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు మంత్రిపైన, ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోశారు. తక్షణం మంత్రిని బర్తరఫ్ చేయాలని కోరారు. రాష్ట్రం తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి వ్యవహరిస్తున్న తీరును రోహిత్ పవార్ విమర్శించారు.రోహిత్ పవార్ పార్టీ అధినేత శరద్ పవార్ కు వరుసకు మనుమడు అవుతారు.మహారాష్ట్రలో వ్యవసాయరంగం సమస్యలతో కొట్టుమిట్లాడుతోంది,

రోజూ కనీసం 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏమీ చేయలేని వ్యవసాయ మంత్రికి రమ్మీ ఆడడానికి చక్కటి సమయం దొరికినట్లు అన్పిస్తోందని రోహిత్ పవార్ ఎక్స్ లో ఒక పోస్ట్ లో కామెంట్ చేశారు. తప్పుదారి పట్టిన మంత్రులు, ప్రభుత్వానికి పంటల భీమా, రుణమాఫీ, వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కోరే రైతుల గోడు పట్టదా అని రోహిత్ పవార్ నిలదీశారు. కాగా, ఆన్ లైన్ లో రమ్మీ ఆడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావ్ కోకడే అజిత్ పవార్ ఎన్ సీపీ వర్గానికి చెందిన వారే.కాగా, మాణిక్ రావ్ కోకడే మరొకరిపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు. ఎవరో తన ఫోన్ లో గేమ్ డౌన్ లోడ్ చేసుకున్నారని, దానిని తొలగించేందుకు తాను యత్నిస్తుండగాఎవరో వీడియోను రికార్డ్ చేశారని మంత్రి
అన్నారు. ఇది ప్రతిపక్షాల కుట్ర అని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News