నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 30 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల్లో తీవ్ర అస్వస్థతగా ఉన్న ఒకరిని నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై తమ పిల్లలను వెంటనే ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా ఇళ్ల వద్ద ప్రథమ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బిజెవైఎం, సిపిఎం నాయకులు వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం పలువురు విద్యార్థుల నుండి వివరాలు సేకరించగా భోజనంలో పురుగులు వస్తున్నాయని, ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని, కూరగాయలు, సాంబార్‌లో నాణ్యత లేదని ఆరోపించారు. వంట గదిలో నీరు చేరి, దోమలు విజృంభించడంతో అనారోగ్యాల బారిన పడుతున్నట్లు విద్యార్థులు వివరించారు.
ఈ సందర్భంగా బిజెవైఎం, సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్కూళ్లను డెవలప్ చేస్తామని చెప్పి గురుకుల పాఠశాలలను గాలికి వదిలేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 100 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందారని ఆరోపించారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించి విద్యార్థుల ఆరోగ్యాలను కాపాడాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా..విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తన దృష్టికి రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు లింగస్వామి, మార్కండేయ, శివ, సిపిఎం మండల కార్యదర్శి దశరథం తదితరులు పాల్గొన్నారు.