అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన పోలీసులు, అటవీ సిబ్బందిపై పలువురు గ్రామస్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం, కేశవపట్నంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేశవపట్నంలో అటవీ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో కవ్వాల్ టైగర్ రిజర్వు ప్రాంతంలోని 71, 72 కంపార్ట్‌మెంట్‌లలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అయితే, అటవీ ప్రాంతంలో స్థానికంగా వ్యవసాయం చేసుకుంటున్న పలువురు గ్రామస్థులు ఒక్కసారిగా పోలీసులు, అటవీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. మహిళలు, పురుషులు మూకుమ్మడిగా రాళ్ళతో దాడి చేయడంతో ఇచ్చోడ ఎస్‌ఐ పురుషోత్తంగౌడ్‌తో సహా పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా
పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో కేశవపట్నం-సదకగూడెం గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్‌పి అఖిలేష్ మహాజన్, అటవీ శాఖ ఉన్నతాధికారులు అదనపు బలగాలతో ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన గ్రామస్థులు పారిపోయారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఘటనకు దారితీసిన అంశాల గురించి ఎస్‌పి ఆరా తీశారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా, దాడికి దిగిన పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.