బిజెపి నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజా సింగ్ యూ టర్న్ తీసుకున్నారు. రాజా సింగ్ సస్పెన్షన్‌పై బిజెపి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నా, ఆ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్‌కు లిఖితపూర్వకంగా పంపిస్తేనే స్పీకర్ ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసేందుకు రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులో సెక్షన్ 6లో స్పష్టంగా ఉంది. పార్టీ నాయకత్వం స్పీకర్‌కు లేఖ రాయని పక్షంలో అది పార్టీ అంతర్గత వ్యవహారంగానే ఉంటుంది. అయితే రాజాసింగ్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌కు లేఖ రాయలేదంటే ఆయన పట్ల జాతీయ నాయకత్వం మెతక వైఖరితో ఉందనేది స్పష్టమవుతున్నది.
ఈ విషయంలో తాను కూడా పట్టుదలకు వెళ్ళకుండా ఉండాలని రాజా సింగ్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఆయన బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికకు తాను వెనకాడేది లేదన్నారు. మజ్లిస్ పార్టీతో మిలాఖత్ అయిన కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా గురించి ప్రశ్నించగా, పార్టీ ఆదేశిస్తే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.