హిమాచల్ ప్రదేశ్‌లోని హట్టి గిరిజన ప్రాంతంలో షిలాయ్ గ్రామంలో సునీత చౌహాన్ ఇద్దరు భర్తల భార్య అయింది. ఈ నెల 12వ తేదీన సునీత నవ వధువు వస్త్రధారణతో ఉండగా ఆమెకు కుడి ఎడమల ప్రదీప్ నెగి, కపిల్ నెగిలు వరుడి వేషధారణతో ఉన్నారు. వీరికి స్థానిక జానపద నృత్యాలు, తాళాలు తప్పట్ల మోత నడుమ , వందలాది మంది అతిధుల రాక మధ్య శాస్త్రీయ రీతిలో పెళ్లి జరిగింది. సునీతను మనువాడిన ఇద్దరూ సోదరులే. సిరాముర్ జిల్లాలోని ఈ ప్రాంతంలో బహుభార్యత్వం మాదిరిగా బహుభర్తత్వం లేదా ఇక్కడి జోడీదారి పద్ధతి ప్రకారం పెళ్లి జరిగింది. చట్టప్రకారం ఈ వివాహం నేరం అయినప్పటికీ ఈ గిరిజన తెగలలో జోడిదారి పద్ధతి చెల్లుతుంది. పైగా కుటుంబ ఐక్యత చాటేందుకు, పూర్వీకుల సంక్రమిత ఆస్తులు, భూమి వేర్వేరు కాకుండా ఉమ్మడి వ్యవహారాలు సాగేందుకు ఉమ్మడి కుటుంబాల పురాతన సాంప్రదాయాల మేరకు దీనిని అంతా ఆమోదిస్తారు.
తరాల కిందట ఈ విధమైన ఒక భార్య ఇద్దరు లేదా ముగ్గురు భర్తల తంతు విధిగా తమ కుటుంబ ఆచార వ్యవహారంగా తప్పనిసరిగా పాటించేవి. దీని గురించి వేరే విధంగా భావించే పని ఉండకపోయేది. కుటుంబ సంప్రదాయాలు ప్రకారం తాను ద్రౌపదిగా మారినా తనకు దిగులేమి లేదని సునీత తెలిపింది. ఇక కొత్త పెళ్లికొడుకులు ఇద్దరూ విద్యాధికులే. ప్రదీప్ స్థానిక ప్రభుత్వ ఉద్యోగి. కాగా కపిల్ విదేశాలలో ఉద్యోగంలో ఉన్నాడు. తమ భార్య గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా తాము పెళ్లి చేసుకున్నామని వీరు తెలిపారు. కాపురం సజావుగా సాగుతుందన్నారు. మనిషి జీవితంలో రాబోయే భార్య పట్ల ప్రేమ ఉండాలి. ఇదే దశలో అప్పటివరకూ ఉన్న ఉమ్మడి కుటుంబ కలిసికట్టుదనం కొనసాగాలి. ఇందుకు తగు ఏర్పాటుగానే ఈ జోడిదారి పద్దతిని, కట్టడిని పూర్వీకులు ఖరారు చేసి ఉంచారని, దీనిని తాము జవదాటడం లేదని ఈ ఇద్దరూ తమ ఉమ్మడి సహధర్మచారిణి సునీతతో కలిసి ఉన్నప్పుడు తెలిపారు. తమ ఈ పద్థతిని ఇక్కడి గిరిజన యాసలో జాజ్డా అని వ్యవహరిస్తారని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ చట్టాలలో ఇటువంటి పెళ్లి సక్రమమేనని , దీనికి చట్టబద్దత చిరకాలంగా ఉందని ప్రకటితం అయి ఉంది. ఈ పెళ్లికి మరో ప్రత్యేకత ఉంది. వధువు తరఫు వారు ఉమ్మడి వరుల ఊరికి తరలివెళ్లుతారు. ఈ తంతును సింజు అని పిలుస్తారు. అక్కడ పెళ్లి మండపంలో లేదా దేవాలయ ఆవరణలో చూడముచ్చటగా ముగ్గురు ఒక్కటవుతారు. ఉమ్మడి కుటుంబాల ప్రేమ ఆప్యాయతలు, పూర్వీకుల ఆస్తులు , పెళ్లిలతో విభజితం కాకుండా ఉండేందుకు కొన్ని కుటుంబాల వారు ఇప్పటికీ ఇటువంటి ఆచార వ్యవహారంతోనే సాగుతున్నారు. ఒక ఆమె ఇద్దరు ఆయనలుగా కథ సుఖాంతం అవుతోంది.