Monday, July 21, 2025

జాతీయ భాష అక్కర్లేదు

- Advertisement -
- Advertisement -

హిందీ మాట్లాడేవాళ్లు ఎక్కువ ఉన్నారని దాన్ని
మాపై రుద్దుతాం అంటే కుదరదు తెలుగును
జాతీయ భాషగా చేయాలని నేను ప్రతిపాదిస్తే
ఒప్పకుంటారా? సంస్కృతి, స్థానిక ఉనికికి
భాషలు ప్రతీక డీలిమిటేషన్‌లో దక్షిణాది
రాష్ట్రాలకు నష్టం జరిగితే సహించేది లేదు
ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితేనే ప్రజలకు
మేలు జైపూర్‌లో ‘టాక్ జర్నలిజం’ చర్చలో
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్: జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరగరాదని, ఆ విధంగా కేంద్రం ముందుకెళితే సహించేది లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మం త్రి కెటిఆర్ హెచ్చరించారు. ఉత్తర భారత దేశ ఎంపీల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడే కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశ ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లాంటి ఒక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు. జైపూర్‌లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చలో ఆదివారం పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. మంద బలం, అధికారం ఉందన్న అహంకారంతో జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని స్పష్టం
చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్న కేటీఆర్ తనకు ఇష్టం వచ్చిన పనులు చేస్తానని బిజెపి అనుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఆ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల సర్వేపై స్పందించిన కెటిఆర్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కును కోల్పోకోకూడదని అన్నారు. బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది మొదటిసారి కాదని, అయితే ఈసారి మాత్రం తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయని తెలిపారు. ఇంత జరుగుతుంటే భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. బీహార్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల తమకు చాలా అభ్యంతరాలు ఉన్నాయని, దేశంలోని మిగతా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. డీలిమిటేషన్ అనేది ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడానికి చేస్తారని, అయితే ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఆ ప్రక్రియను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. కానీ జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయడం సరికాదని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ ప్రక్రియను కట్టుదిట్టంగా పాటించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

హిందీని రుద్దుతామంటే ఒప్పుకునేది లేదు
దేశానికి ఒక జాతీయభాష ఉండాల్సిన అవసరం లేదని కెటిఆర్ అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశం అద్భుతంగా పురోగమిస్తుందని, ఇప్పుడు ప్రత్యేకంగా ఒక జాతీయ భాష ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. మందబలం, అధికారం ఉన్నాయన్న అహంకారంతో బలవంతంగా హిందీని రుద్దుతామంటే ఒప్పుకునేది లేదని కెటిఆర్ హెచ్చరించారు. ప్రతి 250 కిలోమీటర్లకు మనదేశంలో భాషా, సంస్కృతి, ఆహారం, వేషభాషలు మారుతాయని తెలిపారు. ఈ విషయంలో యూరప్‌కు ఇండియాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంగ్లీష్ ని మాట్లాడుతారని, ఇంగ్లీష్ తోనే అపార అవకాశాలు దొరుకుతాయని అన్నారు. కేవలం హిందీ నేర్చుకొని అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్లి మనం ఏం చేయగలమని కెటిఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. 7080 ఏళ్లుగా దేశం బాగానే ఉందని, ఇప్పుడు జాతీయ భాష ప్రస్తావన ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. దేశంలో అత్యధికులు మాట్లాడుతున్న భాషల్లో ఒక్కటైన తెలుగును జాతీయ భాషగా చేయాలని తాను ప్రతిపాధిస్తే ఒప్పుకుంటారా? అని ఎదురు ప్రశ్నించారు. సంస్కృతి, సంప్రదాయాలు, స్థానికి ఉనికికి భాష ప్రతీకగా నిలుస్తుందని కెటిఆర్ అభిప్రాయపడ్డారు.

ముందు దేశం, ఆ తర్వాతే ప్రాంతం, మతం, కులం
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజల తరఫున వారి సమస్యలను పార్లమెంట్‌లో మరింత సమర్థవంతంగా వినిపించడానికే రాజ్యాంగంలో నియోజకవర్గాల పునర్విభజన ఉందని కెటిఆర్ చెప్పారు. ప్రతి రాష్ట్రానికి ఉన్న జనాభా సంఖ్య ఆధారంగా పార్లమెంటులో ఆ రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో గతంలో పునర్విభజన జరిగేదని, అందుకే గతంలో ప్రతి పదేళ్లకు జనగణన, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగేదని తెలిపారు. అయితే జనాభా విపరీతంగా పెరగడం కారణంగా 1971లో రాజ్యాంగ సవరణ చేసి భారత పార్లమెంటు స్థానాలను 543 దగ్గర ఆపివేశారని వివరించారు. 30 సంవత్సరాల తర్వాత మళ్లీ నియోజకవర్గ పునర్విభజన చేస్తామన్నారని, అయితే ఈలోపు ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. దానికి అనుగుణంగా దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణలో పకడ్బందీగా అమలు చేశారని స్పష్టం చేశారు.

అందుకే 1948లో 26 శాతంగా ఉన్న దక్షిణ భారత దేశ జనాభా 19 శాతానికి తగ్గిందని వెల్లడించారు. కానీ ఉత్తర భారత దేశంలో ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ సరిగా అమలు చేయలేక 1950 నుంచి ఇప్పటివరకు 239 శాతం జనాభా పెరిగిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ వంటి కుటుంబ నియంత్రణ సరిగా అమలు చేయని రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యాన్ని పెంచి దక్షిణాదికి తగ్గిస్తామనడం సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ కాంగ్రెస్‌తో పాటు బిఆర్‌ఎస్ కూడా ఒకే అభిప్రాయంతో ఉందని, అందుకే ఇటీవల చెన్నైలో జరిగిన సమావేశంలో ఒకే అభిప్రాయాన్ని తాము వ్యక్తం చేశామని కెటిఆర్ వివరించారు. ప్రధానమంత్రిని ఉత్తర భారతదేశం నిర్ణయించాల్సి వస్తే రేపు ఆ ప్రభుత్వం ఆ ప్రాంతం ప్రయోజనాలకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుంది కానీ దక్షిణ భారతదేశం అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎమ్మెల్యే స్థానాలు పెంచుతామని చెప్పారని, కానీ ఇప్పటివరకు చేయలేదన్నారు. కానీ ఎవరు అడగకముందే వారి రాజకీయ ప్రయోజనాల కోసం జమ్ము కాశ్మీర్, అస్సాంలో మాత్రం అసెంబ్లీ సీట్లను పెంచారని విమర్శించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వమని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెబుతున్న మాటల్ని తాము నమ్మడం లేదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News