Monday, July 21, 2025

తెలంగాణ శిల్పకళ

- Advertisement -
- Advertisement -

శిల్పశాస్త్రాలు, ప్రతిమలు పూర్తిగా ఆధ్యాత్మికతను ప్రతిబింబించే కళారూపాలని స్పష్టంగా చెప్తాయి. మతభావనలకు మూర్తిమత్వాన్నిచ్చిన వస్తురూపాలు. శిల్పులు, స్థపతులచేత వారి నైపుణ్యంతో ప్రతిభావంతంగా తీర్చిదిద్దిన విగ్రహాలు శిల్పాలు. వారికున్న మతైక, ధార్మిక, తాత్వికతలను రంగరించి శిల్పరూపంలో దైవాన్ని, రాజులను, సామాన్య మానవులను కూడా నేలపైకి దింపినవారు శిల్పులు. ప్రపంచంలోనే మన భారతదేశ శిల్పకళకు ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని వైవిధ్యభరితమైన తాత్విక చింతనలతో కూడిన ప్రధాన మతాలు బౌద్ధ, జైన, శైవ, వైష్ణవాల పరిణామాలన్నీ తెలంగాణలో నిర్మించ బడ్డ అనేక గుడులలో ద్యోతకమౌతున్నాయి.

షోడశ జానపదాలలో ఒకటైన ‘అస్మక’ తెలంగాణలోనే ఉంది. భౌగోళికంగా, సాంస్కృతికంగా ప్రత్యేకతలున్న తెలంగాణాలో గుడులు, వాటిలోని వైవిధ్య శిల్పసంపద కూడా ఎంతో ప్రత్యేకమైనదే. తెలంగాణ శిల్పకళకు రెండు వేల సంవత్సరా ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది శైవ, వైష్ణవ, బౌద్ధ, జైన దేవాలయ నిర్మాణం, ఇండో- ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో ప్రాంతీయ వైవిధ్యాన్ని కలిగి ఉంది. శిల్పకళ కేవలం కళ మాత్రమే కాదు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ శిల్పాలు ఆయా కాలాల కు చెందిన పాలకుల కళాభిరుచిని, ఆనాటి సమాజ, మతపరమైన నమ్మకాలను ప్రతిబింబిస్తాయి.
తెలంగాణ తొలి శిల్పాలు తెలంగాణలోని పెదరాతి యుగం సమాధుల మీద మూతరాళ్ళు, నిలువు రాళ్ళు ఆంత్రోపోమార్ఫిక్ రూపాల్లో దామెరవాయి, కాచనపల్లి, గలాబ, గుండాల, మొట్లగూడెం, దొంగటోగు, వడ్లకొండ, బండసోమారం, కడవెండిలలో కనిపించడంతో మొదలైంది తెలంగాణ శిల్పకళ. తెలంగాణ ప్రసిద్ధ శిల్పాలు, శిల్పకళా క్షేత్రాలు
బౌద్ధ శిల్పాలు తెలంగాణలో బౌద్ధధర్మ శిల్పాలు అందమైన శిల్పకళతో అలరారుతున్నవి.

నేలకొండపల్లి: అతిపెద్ద స్తూపం. అపురూపమైన బౌద్ధవిగ్రహాలు దొరికినవిక్కడ.
ధూళికట్ట (పెద్దపల్లి): ప్రాచీన బౌద్ధ క్షేత్రాలలో ఒకటి. శాసనంతో కూడిన నాగముచుళింద శిల్పం ప్రత్యేకం.
ఫణిగిరి (సూర్యాపేట): మహాస్తూపం, చైత్యా లు, ఆరామాలు, బుద్ధుని పాదాలు, ధర్మచక్రం, శాసనాలు, నాణాలు లభించిన బౌద్ధధర్మ ప్రదేశం. బుద్ధ విగ్రహం (హుస్సేన్ సాగర్, హైదరా బాద్): గణపతిస్థపతి ఆధ్వర్యంలో చెక్కబడ్డ హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధవిగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహం (58 అడుగులు). జైనశిల్పాలు
తెలంగాణలో అనేక చోట్ల అపురూపమైన జైనధర్మ శిల్పాలున్నాయి.

బోధన్: ఇక్కడ అతిపెద్ద బాహుబలిశిల్పం ఉండేదని చరిత్ర చెబుతున్నది. అయితే ప్రస్తుతం ఆ విగ్రహం మిగిలి లేదు. దేవల్ మసీదుగా పిలువబడుతున్న గుడి తొలుత జైనబసది అని శాసనంలో ఉన్నది.
హన్మకొండ: అగ్గలయ్యగుట్ట మీద 30 అడుగుల ఎత్తైన శాంతినాథుని ఉల్బణ శిల్పముంది. పద్మాక్షిగుట్ట: ఒకనాటి జైనబసది. అందుకు శాసనం, శిల్పాలు సాక్ష్యం గా ఉన్నాయి.
కొలనుపాక: కొలనుపాక జైనాలయంలోని అతిశయ జినబసది రుషభనాథ, నేమినాథ, మహావీరుల శిల్పాలలో మహావీరుని శిల్పం కోట్ల విలువైన జేడ్ రత్నశిల్పం.

గొల్లత్తగుడి: దేశంలోనే అరుదైన ఎత్తైన ఇటుకల గుడి.
కుర్క్యాల: బొమ్మలమ్మగుట్ట మీద జైన ఆ ద్యంత తీర్థంకరులు, చక్రేశ్వరిల శిల్పాలు, జినవల్లభుని త్రిభాషా శాసనం (క్రీ.శ.945) ఉన్నాయి. తెలుగుకు ప్రాచీనభాషాహోదా తెచ్చింది ఈ శాసనమే.
మ్యూజియాలు: నిజామాబాద్ మ్యూజియంలో, కొలనుపాక జైన సంగ్రహాలయంలో, పిల్లలమర్రి మ్యూజియంలో, హైద్రాబాద్ స్టేట్ మ్యూజయంలో జైన శిల్పాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర కూటులు, కళ్యాణీ చాళుక్యులు: ఈ రాజవంశాల ఏలుబడిలో నిర్మించిన దేవాలయాలు అపురూపమైనవి. నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయం, కొలనుపాక సోమేశ్వరాలయం, గంగాపురం కేశవాలయం, కలబగూరు శివాల యం, సిరిచెలిమ గుడి, మంథని, జనగామ దేవాలయాలు కొన్ని ఉదాహరణలు.

కాకతీయులు: కాకతీయ శిల్పకళ తెలంగాణ శైలిగా కీర్తిగాంచినది. కాకతీయుల గుడుల నిర్మాణ శైలి వారికి ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. రామప్ప దేవాలయం (పాలంపేట, ములు గు): 1213లో కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయం యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. రామప్ప దేవాలయ శిల్ప సంపద వల్లనే ఈ శిల్పకళకు తెలంగాణ శైలి అనే పేరొచ్చింది. గుడిచూరు ఊత స్తంభాల మీది శిల్పాలు అలసకన్యలు. రామప్ప నంది చాలా ప్రసిద్ధమైంది. వేయి స్తంభాల గుడి (హనుమకొండ, వరంగల్): 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్ర దేవుడు నిర్మించిన ఈ త్రికూటాలయం (శివుడు, కేశవుడు, సూర్యుడు) తెలంగాణ శిల్పకళకు మరో ఉదాహరణ. గుడి ఎదురుగా వేయి స్తంభాలమంటపంగా పిలువబడే ఆస్థాన మంటపాన్ని ఇటీవలే పునరుద్ధరించారు.

వరంగల్ కోట: కాకతీయ సామ్రాజ్యానికి రాజధాని వరంగల్లు కోటలో అద్భుతమైన శిల్పా లు, కాకతీయ కీర్తి తోరణాలుగా పిలువబడే నాలు గు ద్వారతోరణాలు తెలంగాణ శిల్పకళకు తోరణాలే. ఇండో-ఇస్లామిక్ శిల్పకళ కుతుబ్ షాహీ నిజాం రాజుల కాలంలో ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్పం శిల్పకళ అభివృద్ధి చెందింది. చార్మినార్ (హైదరాబాద్): 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన చార్మినార్ నాలుగు మినార్లు, క్లిష్టమైన శిల్పాలతో ఇస్లామిక్ నిర్మాణ శైలికి ఉదాహరణ. ఇది తెలంగాణ చిహ్నం.
మక్కా మసీదు: ఇండో ఇస్లామిక్ శైలికి ఈ మసీదు మరో ఉదాహరణ
కుతుబ్షాహీ టోంబ్స్: ఈ సమాధులు నిర్మాణశిల్పకళ అపురూపం.

  • శ్రీరామోజు హరగోపాల్
    (కన్వీనర్, కొత్త తెలంగాణ
    చరిత్ర బృందం, హైద్రాబాద్)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News