- Advertisement -
ఆమెలో.. ఇద్దరు వ్యక్తులు
మొదటి మనిషి మృదువుగా సంభాషిస్తుంది
ఉత్తమ ఇల్లాలుగా
ఎదురు చెప్పని కోడలిగా
పిల్లలకు ప్రియమైన తల్లిగా
కుటుంబానికి అండగా
బంధువులకు ఆదర్శ మహిళగా
అలుపెరుగక మెలుగుతుంది
అందరి అవసరాలు తీరుస్తుంది
రెండవ మనిషిలో దాగుంది
అగ్నిశిఖలా వెలిగే హృదయం
ప్రేమ కోసం సర్వం వదుల్చుకునే ధైర్యం
శృంఖలాలు తెంచుకోవాలనే ఉన్మాదం
ఆమె అనుకుంటుంది
అడవి అందాలు చూడాలని
వెన్నెల్లో విహరించాలని
సముద్రపు అలల్లా ఉప్పొంగాలని
చిటపట చినుకుల్లో చిందులు వేయాలని
సెలయేరులా పరుగులు తీయాలని
ఆమె రాసుకుంటుంది కవితలు డైరీలో
అవి దాక్కుంటాయి
అలమారులోని చీరల మడతల్లో
నిశీధిలో హృదయమనే నెగడు చుట్టూ
చేస్తాయి అవి అద్భుత నృత్యాలు
ద్వంద్వ ప్రవృత్తి దేని కోసం?
ఒకటి లోకం కోసం
మరొకటి నిగూఢంగా దాగున్న
అడవితనాన్ని ప్రేమించే మనసు కోసం
- శాంతిశ్రీ బెనర్జీ (జాయ్ దేష్ముఖ్ రణదేవ్ కవితల
ప్రేరణతో రాసుకున్న కవిత)
- Advertisement -